మాదప్ప కొండ వద్ద చిరుత పంజా
మైసూరు/మండ్య: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రఖ్యాత మలె మహదేశ్వర కొండకు పాదయాత్ర ద్వారా వెళుతున్న ఓ భక్తుడు చిరుతపులి దాడికి బలయ్యాడు. మండ్య జిల్లా చీరనహళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ (30) మృతుడు. వివరాలు.. మలెమహదేశ్వర కొండ మీద ఆలయానికి మండ్య జిల్లా చీరనహళ్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది పాదయాత్రగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తాళబెట్టలో బస చేసి బుధవారం ఉదయమే తిరిగి పాదయాత్ర కొనసాగించారు. అయితే రంగస్వామి ఒడ్డు సమీపంలో పాదయాత్రికుల మార్గంలో కాపు కాచి కూర్చొన్న చిరుత దాడి చేసి చీరనహళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌ను లాక్కెళ్లింది. అతని వెంట ఉన్న స్నేహితులు కేకలు వేసి చిరుతను పారదోలేందుకు ఎంత ప్రయత్నించినా చిరుత వదల్లేదు. మలెమహదేశ్వర బెట్ట పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు గాలింపు చేపట్టి కొండ పొదల్లో అతని మృతదేహాన్ని కనుగొని, తరలించారు. గత వారం రోజులుగా చిరుత సంచారం కనిపించినా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టనందునే చంపేసిందని భక్తులు ఆరోపించారు. ఈ దుర్ఘటనతో పాదయాత్రికుల్లో కలవరం నెలకొంది.
నడిచి వెళ్తున్న భక్తుని హతం
మాదప్ప కొండ వద్ద చిరుత పంజా


