రాష్ట్రంలో పులుల గణన షురూ
శివాజీనగర: రాష్ట్రంలో కాళి, భద్రా, నాగరహొళె, బండీపుర, బీ.ఆర్.టీ హిల్స్ తదితర అరణ్య ప్రాంతాలలో సోమవారం నుంచి పులి, ఇతర మాంసాహార ప్రాణుల గణాంక ప్రక్రియ ఆరంభమైంది. అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె బాల్కిలో విలేకరులతో ఈ విషయం తెలిపారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి దేశమంతటా పులుల సర్వే జరుగుతుందన్నారు. ఇప్పుడు 6వ సర్వే ఆరంభమైందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 563 పులులు ఉన్నాయని అంచనా ఉందన్నారు. దేశంలోనే రాష్ట్రం 2వ స్థానం పొందిందన్నారు. 38 అటవీ విభాగాల్లో లెక్కింపు జరుగుతుందన్నారు. 3 రోజుల పాటు ముగ్గురితో కూడిన బృందాలు రోజూ 5 కి.మీ.అడవిలో సంచరించి, పులి, చిరుతతో పాటుగా అన్ని మాంసాహార ప్రాణుల, ఏనుగుల అడుగుల గుర్తులను సేకరిస్తారన్నారు. ఆ తరువాత జనవరి 15 నుంచి 17 వరకు 2వ స్థాయి లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జింకలు, ఏనుగులు, అడవి దున్నలతో పాటుగా శాకాహార జంతువుల సమాచారాన్ని నమోదు చేస్తారని చెప్పారు.
మైసూరు ఎయిర్‌పోర్టులో
పెద్ద పులి
మైసూరు: మైసూరు జిల్లాలోని అడవి అంచున ఉన్న గ్రామాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న పులులు ఇప్పుడు ఏకంగా మైసూరు నగరానికే వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం, మైసూరులోని బెమెల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఓ పెద్ద పులి సంచరిస్తున్నట్లు కనిపించింది. అటవీ అధికారులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరకలేదు. ఇప్పుడు, మైసూరులో మండకల్లి విమానాశ్రయంలో మరో పులి కనిపించింది. అక్కడి సిబ్బంది మొబైల్ ఫోన్‌లో దానిని వీడియో తీయగా అది ప్రచారంలో ఉంది. సోమవారం ఉదయం పులి అక్కడ తిరుగాడింది. సిబ్బంది కేకలు వేయడంతో పొదల్లో దాక్కుంది. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవిశంకర్, డీసీఎఫ్ కె. పరమేష్, ఏసీఎఫ్ రవీంద్ర, ఆర్‌ఎఫ్‌ఓ సంతోష్ హూగర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి అక్కడకు వచ్చిందని, దానిని పట్టుకుంటామని తెలిపారు.
కొళాయిల్లో కలుషిత నీరు
యశవంతపుర: బెంగళూరు లింగరాజపుర వ్యాప్తిలోని కెఎస్‌ఎఫ్‌సి లేఔట్‌లో తాగునీటి పైపుల్లోకి డ్రైనేజీ నీళ్లు కలవడంతో తాగునీరు కలుషితమైంది. అనేకమందికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో స్థానికంగా కలవరం నెలకొంది. ఎక్కడి నుంచి కలుషితం అవుతున్నాయో బెంగళూరు జలమండలి అధికారులు తనిఖీ చేపట్టారు. ఆ లేఔట్‌లో తాగునీటిని నిలిపివేశారు. గత 10 రోజుల నుంచి లేఔట్‌లో కలుషిత నీరు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
పెళ్లి పేరుతో యువతికి
రూ.11 లక్షల టోపీ
మైసూరు: పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతి వద్ద నుంచి రూ.11.76 లక్షలు వసూలు చేశాడో మోసగాడు. ఈ సంఘటన మైసూరు విజయనగరలో జరిగింది. ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే యువతి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో తన వివరాలను నమోదు చేసింది. సచిన్ అనే వ్యక్తి నీ ప్రొఫైల్ నచ్చిందని, తాను విదేశాల్లో ఉన్నానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని మెసేజ్ చేశాడు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు, త్వరలోనే భారతదేశానికి వస్తానని హామీ ఇచ్చాడు. నీకొక మంచి కానుకను పంపుతానని చెప్పి తన ఖాతాకు రూ.35 వేలు బదిలీ చేయించుకున్నాడు. అలా అప్పటి నుంచి ఆమె ద్వారా రూ.11.76 లక్షలను తన ఖాతాకు జమ చేసుకున్నాడు. కొన్నిరోజులుగా అతని ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేసింది.


