ఓంశక్తి భక్తులపై రాళ్ల దాడి
బనశంకరి: దేవీ తేరు సమయంలో ఓంశక్తి మాలధారులపై కొందరు అల్లరిమూకలు రాళ్ల దాడులు చేశారు, ఈ ఘటన బెంగళూరు చామరాజపేటే జగ్జీవన్‌రామ్ నగరలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. జేజే నగర వీఎస్.గార్డెన్ ఓంశక్తి దేవస్దానం ముందు మాలధారులు రథోత్సవం జరుపుతుండగా ఎవరో దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ బాలిక, మహిళా భక్తురాలికి గాయాలు తగిలాయి. దీంతో మాలధారులు ఆందోళనకు దిగారు. కోపోద్రిక్తులైన ఓంశక్తి మాలధారులు వందలాదిగా పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో హిందూ భక్తులపై తరచూ దాడులు జరుగుతున్నట్లు ఆరోపించారు. ముందుజాగ్రత్తగా ఠాణాతో పాటు ఆలయం వద్ద కేఎస్‌ఆర్‌పీ బలగాలు మోహరించాయి. దాడికి పాల్పడిన నలుగురు కుర్రవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పశ్చిమ డీసీపీ యతీశ్ తెలిపారు.
మంత్రి జమీర్ ఖండన
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాళ్ల దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కనిపెట్టాలని డీసీపీని ఆదేశించారు. చామరాజపేటేలో హిందూ–ముస్లింలు సోదరులుగా జీవిస్తున్నారని ఇలాంటి ఘటన గతంలో జరగలేదన్నారు. కాగా, నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు.
బాలిక, మహిళకు గాయాలు
ఠాణా ముందు భారీ నిరసన
బెంగళూరు చామరాజపేటేలో ఘటన


