కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: మనిషి దేహంలో నేత్రాలు ఎంతో ప్రధానమైనవని, కళ్లు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూసేందుకు వీలుండదని, ప్రతి ఒక్కరూ నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని దేవీనగర్ 5వ క్రాస్ యల్లమ్మగుడి సమీపంలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అమ్మ సేవా ట్రస్ట్‌కు చెందిన లక్ష్మీదేవి శ్రీనివాసులు(డిష్ శీనా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్ష శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడితో జీవిస్తుంటారన్నారు. కళ్ల సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఎంతో మంది చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని కొనియాడారు. కంటి చూపులేని వారు ఎందరో ఇబ్బందులు పడుతుంటారన్నారు. అలాంటి వారిని గుర్తించి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత నేత్ర పరీక్ష శిబిరాల ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కంటి సమస్యలను గుర్తించి వాటికి తరుణోపాయం చేసేందుకు వీలవుతుందన్నారు. కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు మోత్కర్ శ్రీనివాస్‌రెడ్డి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
నేత్ర పరీక్ష శిబిరాల నిర్వహణ భేష్
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి


