దెయ్యం పట్టిందంటూ మహిళ హత్య
రాయచూరు రూరల్: ఓ మహిళకు దెయ్యం పట్టిందని, దానిని విడిపించాలనే సాకుతో వేప కట్టెతో కొట్టి ఆమెను హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలిని ఆళంద వేంకటేశ్వర కాలనీకి చెందిన ముక్తాబాయి(26)గా గుర్తించారు. ముక్తాబాయికి ఆరేళ్ల క్రితం మహారాష్ట్రలోని మురుమ్‌కు చెందిన గిడ్డప్పతో పెళ్లి అయింది. వీరికి ఐదేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. భార్యకు దెయ్యం పట్టిందనే అనుమానంతో భర్త గిడ్డప్ప వేప కట్టెతో కొట్టడంతో మూర్ఛతో పడి పోయింది. తన కూతురికి దెయ్యం పట్టలేదని అనవసరంగా వేప కట్టెతో కొట్టవద్దని ముక్తాబాయి తల్లి తిప్పవ్వ విన్నవించినా ఫలితం లేకపోయింది. కన్న కొడుకు ముందే వేపకట్టెతో శుక్రవారం కొట్టి చిత్రహింసలు పెట్టడంతో తలకు, దేహానికి భారీ గాయాలయ్యాయి. ఆమెను గాణగాపుర సంగమం వద్ద నదిలో స్నానం చేయించి దత్తాత్రేయ దర్శనం చేయించారు. అక్కడ నుంచి యాదగిరి జిల్లా గురుమటకల్‌లో ఆలయానికి తీసుకెళుతుండగా మూర్ఛకు గురైంది. చివరికి ఆమెను చికిత్స కోసం కలబుర్గి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా శనివారం మరణించింది. తన అక్కకు ఎలాంటి దెయ్యం పట్టలేదని, ఆమెను భర్త గిడ్డప్ప అకారణంగా కొట్టి చంపేశాడని ముక్తాబాయి చెల్లెలు శ్రీదేవి ఆరోపించారు. కలబుర్గి బ్రహ్మాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని మహారాష్ట్రలోని మురుమ్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.
కలబుర్గి జిల్లాలో ఘటన వెలుగులోకి


