సమస్యల సుడిలో సాయంత్రం కళాశాల
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా విద్య ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటిలో తమ పిల్లలను మంచి విద్యా వంతులుగా మార్చాలనే తపన ప్రతి ఒక్కరికీ రోజు రోజుకు పెరుగుతోంది. విద్య ఉపాధికి మార్గం కావడంతో విద్యపై ఆసక్తి పెరిగి, తప్పనిసరిగా కూడా మారింది. అష్టకష్టాలతో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావడానికి పోటీ పడుతున్నారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు నేటి తరం విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. పోటీ ప్రపంచంలో విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఆరాట పడుతున్నవారు కోకొల్లలు. ఒకటో తరగతి నుంచి పీయూసీ వరకు ఏదో రకంగా కష్టపడి చదివే వారు. కొందరికి డిగ్రీ పట్టా పొందేందుకు వివిధ రకాల సమస్యలు ఎదురవడంతో అర్థంతరంగా చదువులు మానేసేవారు.
మౌలిక సదుపాయాలు కరువు
అయితే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి చిన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగానికి ఏదో ఒక డిగ్రీ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాల్సిన నిబంధనలు ఉన్నాయి. అర్ధంతరంగా చదువును మధ్యలోనే ఆపేసిన వారికి డిగ్రీ పట్టా పొందేందుకు ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సాయంత్రం కళాశాలను ప్రారంభించిందే కానీ అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అర్ధంతరంగా చదువును మానేసి సాయంత్రం కళాశాలలో చేరి డిగ్రీ పట్టాను పొందాలనుకునేవారి ఆశలు అడియాసలవుతున్నాయి. పేదరికమో, పరిస్థితుల కారణమో ఉదయం పూట కళాశాలలకు వెళ్లని వారికి సాయంత్రం కాలేజీకి వెళ్లి డిగ్రీ పట్టాను తీసుకోవాలనే ఆశతో ఉన్నవారికి సరైన సదుపాయాలు లేక వెనుకడుగు వేస్తున్నారు. బళ్లారి నగరంలోని సతీష్‌చంద్ర సరళాదేవి కళాశాలలో 2021–22వ విద్యా సంవత్సరంలో ఈ సాయంత్రం కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది.
ఏటా పెరగని విద్యార్థుల సంఖ్య
నాలుగేళ్లుగా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎంత మాత్రం పెరగడం లేదు. కళాశాలల్లో బీకాం, బీసీఏకి ప్రవేశాలు పొందేందుకు చర్యలు తీసుకొన్నారు. ఒక్కొక్క తరగతికి కనీసం 15 మంది విద్యార్థుల అవసరం ఉంటుంది. నాలుగేళ్లుగా ఇప్పటి వరకు బీకాం కోర్సులకు 35 మందిలోపు, బీసీఏ కోర్సులకు 25 మంది మాత్రమే కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంట్లో పేదరికం, కుటుంబాల బాధ్యత, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనివార్య కారణాల వల్ల తరగతి గదులకు హాజరు కాని వారికి సాయంత్రం కళాశాలకు సంబంధించి 2021లో సంధ్యాశక్తి పథకం కింద డిగ్రీ పట్టా పొందేందుకు ప్రారంభమైన సాయంత్రం కళాశాల మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. ప్రారంభంలో కోర్సులకు జాయిన్ కావడానికి ఆసక్తి చూపినప్పటికీ కళాశాలల్లో బోధన సిబ్బంది సరిగా లేకపోవడంతో విద్యార్థులు చేరడానికి వెనుకడుగు వేస్తున్నారు.
జిల్లాలో ఏకై క సాయంత్రం కాలేజీ
జిల్లాలో ఉన్న ఏకై క సాయంత్రపు కళాశాల సరళాదేవి కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్నా జనంలో అవగాహన, తగినంత ప్రచారం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడంతో పాటు బోధన సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉండటం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడం లేదనే ఆరోపణలున్నాయి. సాయంత్రం కళాశాలల్లో కఠినమైన బీసీఏ, బీకాం కోర్సులను ప్రారంభించారే కానీ బీఏ కోర్సును ప్రారంభించకపోవడం కూడా విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. తగిన కోర్సులు ప్రవేశ పెట్టక పోవడంతో సాయంత్రం కళాశాల కాస్త రాత్రి మబ్బుమయంగా మారిపోయింది. బీఏ కోర్సును ఏర్పాటు చేయడంతో పాటు వృత్తి విద్యా కోర్సులు, బోధన సిబ్బందిని నియమించి తగినంత ప్రచారం నిర్వహించి కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రతి పేద విద్యార్థులకు ఉదయం పూట కళాశాలకు వెళ్లలేని వారికి ఓ డిగ్రీ పట్టా తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత విద్యార్థులు, అవిద్యావంతులు కోరుతున్నారు.
సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్ కళాశాల ప్రవేశ ద్వారం
సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్ కళాశాల భవనం
నాలుగేళ్లలో 65 మంది విద్యార్థులకే ప్రవేశం
వేధిస్తున్న బోధకులు, తగిన కోర్సుల కొరత
సరళాదేవి కాలేజీలో 2021–22వ విద్యా సంవత్సరంలో ప్రారంభం
సమస్యల సుడిలో సాయంత్రం కళాశాల


