విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి
రాయచూరు రూరల్: విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలని రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ను ప్రవాసాంధ్ర ప్రముఖుడు సూర్యదేవర నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్ఛం సమర్పించిన అనంతరం మాట్లాడారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్‌కు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు చేరుకునే ఈ రైలును రాయచూరు వరకు పొడిగించాలన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు ఎంతో అనుకూలం అవుతుందని తెలిపారు.
అగ్నిప్రమాదంలో థియేటర్ బుగ్గి
హుబ్లీ: గదగ్ నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో ఆకస్మికంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోగా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణపాయం జరగలేదు. కానీ థియేటర్‌లోని కుర్చీలు, తెర, స్పీకర్లు, పీఓపీ, ఫ్యాన్లు, ఏసీలు తదితర పరికరాలు కాలి బూడిదయ్యాయి. శాంతి టాకీస్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది హుటాహుటిన విచ్చేసి మంటలను ఆర్పి భారీ నష్టం జరగకుండా నివారించారు. ఘటనపై బెటగేరి లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా సోమవారం సూర్యోదయాన్నే ప్రమాదం వల్ల స్థానికులతో పాటు సదరు థియేటర్ యజమాని, ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
విజ్ఞాన రంగంలో
కొత్త ఒరవడికి బాటలు
రాయచూరు రూరల్: శాసీ్త్రయ, విజ్ఞాన రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని డయట్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ భండారి పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ తాలూకా శివంగి ప్రభుత్వ హైస్కూల్‌లో శాసీ్త్రయ, విజ్ఞాన సమ్మేళనం–2025ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జున, తహసీల్దార్ నాగమ్మ, జాన్ రాబర్ట్‌లున్నారు.
వీనుల విందుగా
సంగీత సమ్మేళనం
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం రాత్రి సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబలదిన్ని జ్ఞాపకార్థం 37వ సంగీత సమ్మేళనాన్ని వీనుల విందుగా నిర్వహించారు. ఉదయ నగర్‌లోని స్వర సంగమ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కిల్లె బృహన్మఠం శాంత మల్ల శివాచార్య ప్రారంభించారు. అంతర్జాతీయ క్లారినెట్ విద్వాంసుడు, స్వర సంగమ సంగీత కళాశాల అధ్యక్షుడు వడవాటి నరసింహులు, భరత్, శారద, చంద్రశేఖర్, వెంకటసింగ్, శివప్రసాద్‌లున్నారు.
జీరామ్‌జీ బిల్లును
ఉపసంహరించుకోండి
హొసపేటె: అభివృద్ధి చెందిన భారతదేశంలో జీరామ్‌జీ బిల్లు– 2025 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జీరామ్‌జీ బిల్లు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)బిల్లు– 2005కు పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ బిల్లును కార్మికులు, కార్మిక సంఘాలు, ఆలోచనాపరులు, మేధావులు, కార్యకర్తలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా రూపొందించారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును హరించే కుట్ర అని ఆరోపించారు.
భార్యను చంపి
ప్రమాదంగా ప్రచారం
దొడ్డబళ్లాపురం: భార్య తలపై బండరాయితో బాది దారుణంగా హత్య చేసిన భర్తను బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. మిట్టగానహళ్లికి చెందిన గాయత్రి(55)ని ఆమె భర్త అనంత్(62)హత్య చేశాడు. ఇద్దరి మధ్య తరచూ పోట్లాటలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను అనంత్ తమ స్థలం వద్దకు తీసికెళ్లి తలపై బండరాయితో కొట్టి చంపాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరికీ చెప్పాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. తరువాత అనంత్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. వీరికి పీయూసీ చదువుతున్న కుమార్తె ఉంది. నిందితున్ని అరెస్టు చేశారు.
విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి
విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి
విశాఖపట్నం రైలును రాయచూరు వరకు నడపాలి


