యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో కృష్ణా నదీ తీరం వెంట ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా, మూడు పువ్వలు, ఆరు కాయలుగా సాగుతోంది. వర్షాభావంతో రైతుల పశువులు, ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే దర్జాగా టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇసుక వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇసుక అక్రమ రవాణ చేసే వారిపై పోలీస్, రెవెన్యూ, ఆర్టీఓ శాఖల అధికారులు మౌనం వహిస్తున్నారు. నారాయణపుర జలాశయం కింది భాగంలో జేసీబీలు, హిటాచీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో యాదగిరి, రాయచూరు జిల్లాలు, తెలంగాణలోని జూరాల, గూగల్, గుర్జాపూర్, దేవదుర్గ, వడగేర, సురపుర, భీమరాయన గుడి, శహాపుర ప్రాంతాల్లో చెక్‌పోస్టులున్నా పోలీసుల కళ్లుగప్పి అక్రమార్కులు ఇసుక రవాణాను నిరాటంకంగా సాగిస్తున్నారు.
భాగ్యనగరానికి భారీగా తరలింపు
హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ, మీరజ్‌ల వరకు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఒక టిప్పర్‌కు రూ.55 వేల నుంచి రూ.60 వేలు, కలబుర్గి జిల్లాలో రూ.80 వేలు, ఇతర రాష్ట్రాలకు రూ.1.50 లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. నిత్యం సుమారు 400 టిప్పర్ల మేర ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ప్రతి టిప్పర్‌లో 35 టన్నుల మేర ఇసుకను రవాణా చేస్తున్నారు. రోజు రూ.2 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ల నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వాహనాల సంచారం అధికమైంది. ఇంత జరుగుతున్నా కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాధికారులు, ఎస్పీలు మౌనం వహించడంపై ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యవహారం
చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికార గణం
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా


