మట్టిలో మాణిక్యం.. గుర్తింపు దక్కని వైనం
హుబ్లీ: క్రీడా రంగంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యాదగిరి జిల్లా క్రీడాకారుడికి తీరని అవమానం జరిగింది. వివరాలు.. యాదగిరి జిల్లా క్రీడా మైదానంలో తగిన వసతులు లేక క్రీడాకారులు పడరాని పాట్లు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దుస్థితి నెలకొన్నా సంబంధిత ఆఖ అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఏమి పట్టించుకోవడం లేదని ఖేలో ఇండియా ఫేం క్రీడాకారుడు లోకేష్ రాథోడ్ పెదవి విరిచారు. సోమవారం మైదానం ఎదుట రోడ్డులో తాను సాధించిన వివిధ పతకాలను ప్రదర్శించి ధర్నా చేపట్టారు. గత నెలలో రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో పాల్గొని మూడో స్థానం చేజిక్కించుకొని దేశ గౌరవాన్ని పెంచానన్నారు. ఇప్పటి వరకు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 50కి పైగా పతకాలను సాధించారు. జాతీయ డెకథ్లాన్ పోటీలు–2025కు కసరత్తు చేసే క్రమంలో తగిన సౌకర్యాల కొరతతో బెంగళూరుకు ఎంతో వ్యయప్రయాసలతో వచ్చి వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ కారణంగా ఎన్నో పోటీల్లో పాల్గొనలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా పోటీల్లో తృతీయ విజేతగా నిలిచినా కూడా యాదగిరి జిల్లా యంత్రాంగం ఒక్కసారైనా తనను పిలిచి అభినందించలేదన్నారు. ఐపీఎల్ వంటి జల్సా ఆటల్లో పాల్గొనే క్రీడాకారులకు మాత్రం ఎక్కడ లేని స్వాగతాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత పేదరికం నేపథ్యంలో క్రీడాకారులు జిల్లా యంత్రాంగానికి కానీ పాలకుల కంటికి గాని కనిపించడం లేదని వాపోయారు. గత మూడున్నరేళ్ల నుంచి జిల్లా క్రీడా యోజన అధికారికి నిరంతరంగా వినతిపత్రాలు సమర్పించి సమస్యలను ఏకరువు పెట్టినా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ జాతీయ క్రీడాకారుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రోడ్డుపై పతకాలను ప్రదర్శించి
జాతీయ క్రీడాకారుడి అక్రందన


