భర్త ఎమ్మెల్యే.. భార్య అంగన్‌వాడీ
సాక్షి, బళ్లారి: ప్రజా ప్రతినిధిగా గెలుపొందితే చాలామంది తమకెవరూ సాటి లేరని గర్వపడతారు. అందులోనూ ఎమ్మెల్యే భర్త దొరికితే భార్యల కనుసన్నల్లోనే పాలన సాగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇందుకు భిన్నంగా భర్త ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన భార్య మాత్రం అంగన్‌వాడీ టీచర్‌గా ప్రస్థానం కొనసాగిస్తోంది. తన వృత్తికి స్వస్తి చెప్పకుండా.. చిన్న పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాధారణ జీవితం గడుపుతోంది. బెళగావి జిల్లా ఖాణాపుర ఎమ్మెల్యే విఠలహలగేకర్ టీచర్‌గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. అనంతరం గత శాసనసభ ఎన్నికల్లో ఖాణాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతడి భార్య రుక్మిణమ్మ అప్పటికే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసేది. భర్త ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆమె తన వృత్తికి స్వస్తి చెప్పలేదు. సాధారణ జీవితం గడుపుతూ బెళగావి 149 సెంటర్‌లో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. 2011 నుంచి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఆమె పలువురికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన భర్త ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తే.. తాను టీచర్‌గా పాఠాలు నేర్పుతున్నానని చెబుతున్నారు.
చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలోనే సంతృప్తి అంటున్న ఎమ్మెల్యే భార్య


