24న కిష్కింధ విశ్వవిద్యాలయం ఘటికోత్సవం
సాక్షి బళ్లారి: సిరుగుప్ప తాలూకా సింధిగేరి సమీపంలోని కిష్కింధ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో డిసెంబరు 24న ప్రథమ ఘటికోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ టీఎన్.నాగభూషణ్ పేర్కొన్నారు. ప్రముఖులు ఫృథ్వీరాజ్, యశ్వంత్‌భూపాల్, మహిపాల్‌తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ విచ్చేస్తున్నాని పేర్కొన్నారు. 80 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం ఉంటుందని వివరించారు. ఎంబీఏలో షబానాకు 9.33, సౌగంధిక లక్ష్మీ 9.27 సీజీపీతో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారని, వారికి బంగారు, వెండి పథకాలను గవర్నర్ అందజేస్తారన్నారు. బీఐటీఎం డైరెక్టర్ ఫృథ్వీరాజ్ మాట్లాడుతూ పేదలకు ఉన్నత చదువులు అందాలనే దూర దృష్టితో కిష్కింధ విశ్వ విద్యాలయం నెలకొల్పామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు అమరేశయ్య, భరత్, ఈరణ్ణ, తదితరులు పాల్గొన్నారు.


