ఘర్షణ వద్దన్న వ్యక్తి హత్య
హొసపేటె: నగర శివారులోని కారిగనూర్‌లో చిన్న విషయంపై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. రూరల్ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. కరిగనూర్ నివాసి మాబుసాబ్(50) కుమారుడు మౌలా హుసేన్‌తో కొందరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో తన కుమారుడితో ఘర్షణ పడవద్దంటూ తండ్రి మాబూసాబ్ ఆ యువకులను అడ్డుకునేందుకు యత్నించారు. కోపోద్రిక్తులైన యువకులు మాబూసాబ్‌పై దాడిచేసి హత్య చేశారు. కుటుంబ సభ్యులు నగర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని రోధించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భంగి హనుమంత, చరణ, హులిగెమ్మతోసహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్ర, దర్శన్, చంద్రశేఖర్, గురురాయ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐజీపీ వర్తికాకటియార్, ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్, డీవైఎస్పీ డాక్టర్. మంజునాథ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.


