చిన్నారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి
కోలారు: పిల్లలలో దాగిన ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం కల్పించాలని, ఇందుకు ప్రతిభా కారంజీలు చక్కటి వేదిక అని బీఈఓ మధు మాలలీ పడువణె తెలిపారు. నగరంలోని అంజుమన్ ఆల్ అమీన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాలూకాస్థాయి ప్రతిభా కారంజి పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠాలతోపాటు, ఇతర కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు. కోలాటం, పౌరాణిక నాటకాలు, బుర్రకథ, ఇలా అనేక కళల సాధకులు జిల్లా నుంచే వెళ్లారన్నారు. పాఠాలతోపాటు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నాగరాజ్, వెంకటాచలపతిగౌడ, గోవిందు, శ్రీనివాస్, నంజుండగౌడ, తదితరులు పాల్గొన్నారు.


