రైతుకు నష్టం.. దళారులకు లాభం
సాక్షి, బళ్లారి: నెల రోజులు కిందట ఉల్లి ధర అమాంతం పడిపోయింది. దళారుల మాయతో .. తాజాగా రోజు రోజుకూ పెరుగుతోంది. రైతులు విక్రయించినపుడు కిలో ఉల్లి రూ.5కు కొనుగోలు చేసిన దళారులు గోదాముల్లో నిల్వ ఉంచారు. ఇపుడు కిలో రూ.25కు పైగా విక్రయిస్తున్నారు. పంట పండించిన రైతన్న పెట్టుబడులు దక్కక నష్టపోగా.. వ్యాపారులు మాత్రం లాభం మూటగట్టుకుంటున్నారు.
రైతులకు భారీ నష్టం
ఉమ్మడి బళ్లారి జిల్లాతోపాటు, చిత్రదుర్గం, బాగల్‌కోట, బీజాపూర్, బీదర్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుకు రూ.80 వేల వరకు ఖర్చు చేసిన రైతులు గిట్టుబాటు ధరలేక అప్పులు కట్టుకోలేని దుస్థితి. 50 కిలోల ఉల్లిగడ్డ సంచిని రూ.200కే విక్రయించుకున్నారు. క్వింటాకు రూ.50 వేలు కూడా రాలేదని గతంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట ఉల్లి గడ్డలను రోడ్డుపై పారవేసి, శవయాత్రలు చేసి ఆందోళన చేస్తే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేకపోయింది. పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధర పెరగడంతో తమకూ నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యాపారుల చేతివాటం
ఉల్లి గడ్డ నిల్వలు రైతుల వద్ద తగ్గిపోవడంతో దళారులు, వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న వద్ద దిగుబడులను కిలో రూ.5కే కొన్న వ్యాపారులు నిల్వలను గోదాములకు చేర్చారు. ఇపుడు రేట్లు పెంచే దానిపై దృష్టిసారించారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన ఉల్లి గడ్డలు మార్కెట్‌కు చేరుతున్నాయి. నగరంలోని ఏపీఎంసీలోని చిరువ్యాపారులు మాత్రం తమ చేతుల్లో ఏమీలేదని, మార్కెట్‌కు వచ్చే దానిని బట్టి ధర నిర్ణయిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 50 కిలోల ఉల్లి గడ్డల సంచి ధర రూ.2000 పలుకుతోంది. లోకల్ ఉల్లి గడ్డల 50 కిలోల సంచి ధర రూ.1500గా ఉంది. రైతుల వద్ద ఖాళీ అయిన తర్వాత, వ్యాపారులు నిల్వలు బయటికి తీసి ధర పెంచి నాలుగింతలు లాభాలు ఆర్జిస్తున్నారు. వచ్చే ఏడాదైనా పాలకులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నెల కిందట కిలో ఉల్లి ధర రూ.5
కొనుగోలు చేసి నిల్వ ఉంచిన వ్యాపారులు
కొరత చూపుతూ ఉల్లి ధరల పెంపు
నష్ట పరిహారం అందించాలని
రైతుల డిమాండ్
రైతుకు నష్టం.. దళారులకు లాభం


