నేరాల నియంత్రణకు సహకరించండి
హొసపేటె: జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు యువత సహకరించాలని రచయిత స్వరూప్ కొట్టూరు కోరారు. కూడ్లిగి తాలూకా నరసింహగిరి గ్రామంలోని బోరమ్మ తమప్ప ఉన్నత పాఠశాలలో జరిగిన నేర నివారణా మాస వేడుకల్లో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ, నేర కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత నేర కార్యకలాపాలకు పాల్పడితే, అది వారి వ్యక్తిత్వంపై మచ్చగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ నాగేంద్ర ఆచార్య, ప్రధానోపాధ్యాయుడు జి.బసశెట్టప్ప, ఆర్.బసవరాజ్, ఎం.శివప్రసాద్, డి.రాజ్‌కుమార్, జి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు
హొసపేటె: కొప్పళ తాలూకా పాతనింగపుర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్‌గా మారింది. వివరాలివీ.. పాతనింగపుర ప్రభుత్వ పాఠశాల పిల్లలకు వడ్డించే భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలకు వడ్డించే ఆహారం, పరిశుభ్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుగులను చూసిన తర్వాత, విద్యార్థులు భోజనం పడేసి అధికారులకు సమాచారం ఇచ్చారని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని వారు ఆరోపించారు.
పథకం పేరు మార్చవద్దు
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం తగదని గ్రామీణ కూలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు గురురాజ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్ర సర్కార్ మార్చిందన్నారు. ఇది పేదల కడుపు కొట్టేలా ఉందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పేర్లను నమోదు చేసేందుకు చేసే ప్రయత్నమేనని అన్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరునే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, మారెమ్మ, రూప, హుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.
21న సంగీత సమ్మేళనం
రాయచూరు రూరల్: సంగీత పితామహుడు పండిత సిద్ధరామ జంబులదిన్నె జ్ఙాపకార్థం ఈ నెల 21న సంగీత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంగీత విద్వాంసుడు వడవాటి నరసింహులు తెలిపారు. పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నగరంలోని స్వరసంగమ సంగీత కళాశాలలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళల దుర్మరణం
రాయచూరురూరల్: చెరకు కోత యంత్రంలో పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బెళగావి జిల్లా అథణి తాలుకా సత్తి గ్రామంలోని కాడగౌడ పోలంలో చెరకు కోత యంత్రం పనులు చేసేందుకు చౌరవ్య(60), లక్ష్మీభాయి(65) వెళ్లారు. యంత్రం పనిచేస్తున్న సమయంలో.. వెనుకభాగంలో మిగిలిన చెరుకుగడలు తీసేందుకు వారు ప్రయత్నించారు. చక్రాలలో ఇరుక్కు పోవడంతో చౌరవ్య, లక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుల కుటుంబీకులకు సాయం
కోలారు: ఉపాధ్యాయురాలు అక్తర్ బేగం కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం అందజేసింది. తాలూకాలోని కెబిహొసహళ్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అక్తర్ బేగం నరసాపురం ఫిర్కాలో జాతి సమీక్ష నిర్వహణ విధులకు వెళ్లారు. అదే సమయంలో ఆమె చెరువులో విగతజీవిగా కనిపించారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్.రవి ఆమె మృతిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. స్పందించిన ప్రభుత్వం అక్తర్ బేగం కుటుంబీకులకు రూ.20 లక్షల పరిహారం అందజేసింది.
నేరాల నియంత్రణకు సహకరించండి
నేరాల నియంత్రణకు సహకరించండి
నేరాల నియంత్రణకు సహకరించండి


