జింకలతో పంటలకు నష్టం
రాయచూరు రూరల్: రైతులు సాగు చేసిన పంటలపై జింకలు తొక్కి.. పరుగుతీయడంతో నష్టపోతున్నారు. కళ్యాణ కర్నాటక పరిధిలోని రాయచూరు, యాదగిరి, కోప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల్లో రైతులు జొన్న, వేరుశనగ, పత్తి, మిరప, ఇతర పంటలు సాగు చేశారు. ఇటీవల పొలంలోకి చొరబడుతున్న జింకలు పంట తొక్కుతూ చిందరవందర చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల సమయంలో జింకల వనం ప్రాధాన్యం గుర్తించే నాయకులు అనంతరం వదిలేస్తున్నారు. తమ బాధను పట్టించు కోవడంలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల జింకలు
జిల్లాలో 20,572 క్రిష్ణ జింకలు, జింకార 16,420, లాంగ్ చాపర్ 10,856, చుక్కలున్న జింకలు 370 ఉన్నాయి. 2006 నుంచి ఈ జింకల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు రైతు సంఘం నేతలు అనందప్ప, రుద్రప్ప వెల్లడించారు. 2010లో పరిహారం అందించడంతో పాటు జింకల వనం నిర్మాణానికి రూ.50 లక్షల మంజూరుకు అనుమతి లభించినా అమలుకు నోచుకోలేదు. 2016లో విధాన సభలో చర్చలు జరిగినా ప్రాధాన్యం ఇవ్వలేదు. వెంటనే జింకల వనం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


