ఉద్యోగి పాదయాత్ర
హుబ్లీ: అవినీతి ఎన్నికల వ్యవస్థను మార్పు చేయాలని కోరుతూ బాగళకోటె నివాసి, ఐటీ ఉద్యోగి నాగరాజ కలకుటకర్ జన జాగృతి పాదయాత్ర చేపట్ట్టారు. భుజంపై జాతీయ జెండా, కన్నడ మాత భువనేశ్వరి ధ్వజం పట్టుకుని ముందుకు కదిలారు. బెళగావి సువర్ణ సౌధలో తన సంకల్పాన్ని ప్రస్తావించేందుకు వచ్చిన నాగరాజ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ లక్షల వేతనాలు వస్తున్నా..వదిలేసి ప్రామాణిక ఉత్తమ ఎన్నికల వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న బెంగళూరు విధాన సౌధ నుంచి పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం, అవినీతి, కుల,మత పిచ్చిలేని, సంస్కార సంప్రదాయాల వ్యక్తిత్వాలకు ప్రతినిధులుగా ఉన్న వారికే ఓటు వేయాలని ప్రజలను జాగృతి చేస్తున్నట్లు వెల్లడించారు. 31 జిల్లాలు, 224 అసెంబ్లీ నియోజక వర్గాలలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే 18 జిల్లా కేంద్రంలో 2300 కిలో మీటర్ల మేర ప్రయాణించానని తెలిపారు. లక్షలాది మంది తనకు నైతికంగా అండగా నిలిచారన్నారు.


