21 నుంచి పల్స్ పోలియో
హొసపేటె: డిసెంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. సంబంధిత కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 0–5 పిల్లలు 1,21,585 మంది ఉన్నారని, వంద శాతం పోలియో చుక్కలమందు పంపిణీ పూర్తి కావాలన్నారు. మొత్తం 923 బృందాలతో 1040 కేంద్రాలలో పోలియో టీకా వేయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రధాన కేంద్రాలలో నాలుగు మొబైల్ బృందాలు, 50 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. 2170 మంది కార్మికులను నియమించామని, తొలి రోజున బూత్ స్థాయిలో టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అదనపు డిప్యూటీ కమిషనర్ ఇ.బాలకృష్ణప్ప, డాక్టర్.జంబయ్య,జేఎం.అన్నదానస్వామి, అధికారులు పాల్గొన్నారు.


