విద్యార్థులు సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలి
హొసపేటె: వచన సాహిత్యంలో దాగిన జీవిత విలువలు, సందేశాలను అర్థం చేసుకోవడం వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుందని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ డీవీ.పరమశివమూర్తి అన్నారు. నగరంలో కన్నడ, సాంస్కృతిక శాఖ, కర్ణాటక సాహిత్య అకాడమీ, బెంగళూరు చకోర సాహిత్య విచార్ వేదిక, శ్రీశంకర్ ఆనంద్ సింగ్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాహిత్య శైలిలో వచన సాహిత్యానికి ముఖ్యమైన, ఆకర్షణీయమైన ప్రాముఖ్యత ఉందన్నారు. సాంకేతికత, కృత్రిమ మేథస్సు యుగంలో, వచనాలను చదివే వారి సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. వచనాలను చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటక సాహిత్యం అకాడమీ సభ్య కన్వీనర్ డాక్టర్ మల్లికార్జున బి.మన్నాడే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులలో సాహిత్యంపై ఆసక్తి, అవగాహన పెంచడానికి పీయూ, డిగ్రీ కళాశాలలో చకోర వచన సాహిత్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పాఠ్యాంశాలతో పాటు వచన సాహిత్యం, నవలలు, కథలు, కవితలను చదవాలన్నారు.


