కాటేస్తున్న వాయు కాలుష్యం
సాక్షి బళ్లారి: తాలూకాలోని శిడిగినమొళ, కారేకల్లు గ్రామాల సమీపంలో వెలసిన ప్రముఖ ఇండస్ట్రీ జానకీ బసాయ్ స్టీల్ పరిశ్రమలతో సమీపంలోని గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలుమార్లు అధికారులకు నివేదికను, సూచనలు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇండస్ట్రీ పక్కనే గల భూముల్లో దుమ్ము, ధూళి చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న తరుణంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో శనివారం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్, పర్యావరణ శాఖాధికారి సిద్దేశ్వరబాబు శిడిగినమొళ, కారేకల్లు పరిసరాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అధికారులు విచ్చేయడంతో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో చేరి పరిశ్రమల నుంచి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. తాము పంటను నష్టపోతున్నామని, ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఒక ఎకరానికి కేవలం రూ.1000ల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇలాంటి నామమాత్ర పరిహారం తమకు అవసరం లేదని వాపోయారు.
భారీగా పంటనష్టం వాటిల్లుతోందని ఆవేదన
ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్లు పంట పండేదని, దుమ్ము, ధూళి వల్ల ఒకటి లేదా రెండు సంచులు కూడా పండటం లేదన్నారు. వారు ఇచ్చే పరిహారం అక్కరలేదని, దుమ్ము, ధూళి లేకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అంతేకాకుండా మంచినీటి చెరువుల్లో కూడా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందన్నారు. సమీపంలోని ఇళ్లల్లోకి కూడా కాలుష్యం రావడం వల్ల ప్రజలకు ఆనారోగ్యకర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం వల్ల పంట పొలాలు, తాగునీరు, ప్రజలకు శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. మానవతా ధృక్పథంలో ఆలోచించి పరిశ్రమల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రారంభం నుంచి ఇదే సమస్య తలెత్తిందన్నారు. అయితే అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే కానీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
నివేదిక వచ్చిన అనంతరం చర్యలపై హామీ
పర్యావరణ శాఖాధికారులు, జిల్లాధికారుల బృందం సమగ్ర తనిఖీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఓ వైపు ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాటు పంటలు కూడా పూర్తిగా నాశనమవుతున్నాయన్నారు. ప్రారంభంలో చిన్నగా మొదలైన జానకీ బసాయి పరిశ్రమలు అంచెలంచెలుగా పెద్ద స్థాయికి చేరుకోవడంతో తమకు శాపంగా మారిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఒత్తిడి చేశారు. రైతులు, స్థానికుల ఆవేదనను విన్నపాన్ని ఆలకించిన అధికారుల బృందం ఉన్నతాధికారులతో చర్చించడంతో పాటు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ప్రజలకు పరిశ్రమల ద్వారా హాని కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకులు, స్థానికులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు.
కారేకల్లు వద్ద పరిశీలిస్తున్న అధికారులు
అధికారికి పంటనష్టంపై వివరిస్తున్న రైతులు
కారేకల్లు, శిడిగినమొళ పరిసరాల్లో పర్యావరణానికి ముప్పు
అసిస్టెంట్ కమిషనర్, పర్యావరణ శాఖ అధికారుల పరిశీలన
దుమ్ము, ధూళితో పంట నష్టాన్ని వివరించిన రైతులు
కాటేస్తున్న వాయు కాలుష్యం


