జర్నలిస్టులకు సదస్సులు అవసరం
హొసపేటె: జర్నలిజంలో ఆధునిక అంశాలను తెలుసుకోడానికి జర్నలిస్టులకు వర్క్‌షాప్ అవసరం, విజయనగర జిల్లాలో కర్ణాటక మీడియా అకాడమి ద్వారా అధ్యక్షుడితో ఇప్పటికే చర్చలు జరిగాయని కర్ణాటక మీడియా అకాడమీ సభ్యుడు కే.నింగజ్జ అన్నారు. హొసపేటెలోని కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆయన సందర్శించి సన్మానం అందుకున్న తర్వాత మాట్లాడారు. ఆధునిక కాలంలో జర్నలిజం చాలా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజల సమస్యలకు స్పందించే వృత్తిపరమైన నైపుణ్యాలు, నివేదికలు లేకపోవడం గమనార్హం. అందువల్ల కర్ణాటక మీడియా అకాడమీ వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా జర్నలిజంలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, కొత్త ఆలోచనలను తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మీడియా అకాడమి కలబుర్గి, హుబ్బళ్లి, కోలారు, మైసూరులలో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లో జర్నలిజం పండితులు, సీనియర్ జర్నలిస్టుల ప్రస్తుత సమస్యలు, సవాళ్ల గురించి జర్నలిస్టులకు అవగాహన కల్పించడానికి త్వరలో వర్క్‌షాప్‌ను నిర్వహిస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ, ఉపాధ్యక్షులు నాగరాజ్, కోశాధికారి వెంకటేష్ పాల్గొన్నారు.
ఘనంగా బసవేశ్వర ఉత్సవం
రాయచూరు రూరల్: తాలూకాలోని ఆల్కూరులో వెలసిన బసవేశ్వర ఆలయంలో మల్లికార్జున, బసవేశ్వర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి ఆలయంలో భక్తులు విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యుల ఆధ్వర్యంలో భక్తులు స్వామివారిని సేవించి రథోత్సవం జరిపారు.
కళాకారులను ఆదుకోవాలి
బళ్లారి అర్బన్: కళాకారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కర్ణాటక ఇతిహాస అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్‌ఎం బసవరాజ్ పిలుపునిచ్చారు. శివదీక్ష మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళను నమ్ముకున్న కళాకారులు తమ వ్యక్తిగత కనీస అవసరాలకు తమపై ఆధార పడిన కుటుంబ నిర్వహణ కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జడేష్ బృందం జానపద గీతాలను ఆలపించారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సన్మానించారు. వేదికపై దేవస్థాన అధ్యక్షుడు కే.రాజశేఖర్ గౌడ, తోలుబొమ్మలాట కళాకారుడు కే.హొన్నూరు స్వామి, ఆలాప్ సంగీత కళా ట్రస్ట్ అధ్యక్షుడు రమణప్ప భజంత్రి, నాగనగౌడ, హాల్‌రెడ్డి, కండక్టర్ పంపాపతి, అరుణ్ గురునాథ్ భట్ పాల్గొన్నారు.


