అద్దె చెల్లించని యజమానుల అంగళ్లకు తాళాలు
హుబ్లీ: దావణగెరె కేఆర్ మార్కెట్‌లోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల భవన సముదాయంలో బాడుగ రూపంలో ఆదాయం చేకూరాలన్న సద్దుదేశంతో 365 అంగళ్ల సముదాయాన్ని నిర్మించారు. వీటిని అద్దెకు కేటాయించారు. అయితే సదరు బాడుగదారులు కొన్నేళ్ల నుంచి అద్దెలు సక్రమంగా చెల్లించకుండా అద్దె అడిగితే నేడు, రేపు అంటూ కాలహరణం చేస్తున్నారు. దీంతో జిల్లాధికారి ఆదేశం మేరకు తహసీల్దార్ డాక్టర్ అశ్వత్, డీడీపీఐ కొట్రేష్ నేతృత్వంలో విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో దావణగెరె సిటీ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్త కార్యాచరణ చేపట్టి బాడుగ బకాయిలు చెల్లించకుండా ఉదాసీన వైఖరితో నడుచుకుంటున్న వ్యాపారుల షాపులకు తాళాలు వేసి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో దారి కొచ్చిన వ్యాపారులు బకాయి పడ్డ లక్షలాది రూపాయల అద్దెలను చెల్లించగా మరి కొందరు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వ్యాపారులపై అధికారులు కొరడా ఝళిపించారు. దీంతో దిగి వచ్చిన వ్యాపారులు సుమారు 60 షాపులకు తాళాలు వేయగా, వీటిలో 30 షాపుల వ్యాపారులు అక్కడికక్కడే రూ.24 లక్షల మేర అద్దెలు చెల్లించారు. మిగిలిన 30 అంగళ్ల వారు బాడుగ బకాయి సొమ్ము విద్యా శాఖకు చెల్లించాల్సి ఉంది. అంతకు ముందు అధికారులు ఒక్కొక్క అంగడికి వెళ్లి ఎంతెంత మేరకు ఎన్ని నెలల నుంచి అద్దె బాపత్తు చెల్లించలేదో క్షుణ్ణంగా ఆరా తీసి కారణాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. బాడుగలు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


