కళ్యాణ కర్ణాటకకు 112 బస్సులు
సాక్షి,బళ్లారి: కళ్యాణ కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు మంజూరైన 112 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం ఆయన విజయపురలో కళ్యాణ కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు చెందిన కొత్త బస్సులను ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది కళ్యాణ కర్ణాటకకు 400 బస్సులు మంజూరు చేశామన్నారు. అన్నింటిని దశల వారిగా అందజేస్తామన్నారు. ఈ 112 బస్సుల్లో విజయపుర జిల్లాకు 27, కలబుర్గికి 25, రాయచూరుకు 18, బళ్లారికి 10, బీదర్‌కు 4, యాదగిరికి 3 బస్సులను మంజూరు చేశామన్నారు. ఈ ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైన బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరో 56 బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. వాటిలో ఏసీ, స్లీపర్, 16 సీటర్ బస్సులను కూడా మంజూరు చేస్తామన్నారు. అంతేకాకుండా కళ్యాణ కర్ణాటకకు విద్యుత్ బస్సులను కూడా చేర్చామన్నారు. వాటిలో కలబుర్గి జిల్లాకు 100, విజయపుర జిల్లాకు 75, బళ్లారి జిల్లాకు 50 బస్సులను ఇవ్వాలని తీర్మానించామన్నారు. మంత్రి ఎం.బీ.పాటిల్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి రామలింగారెడ్డి


