నిధులు పుష్కలం.. రహదారి అధ్వానం
సాక్షి,బళ్లారి: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో! నిధులు విడుదలగాక రోడ్డు అధ్వానంగా ఉంది అంటే ఒక లెక్క. కానీ పుష్కలంగా నిధులున్నా పనులు ప్రారంభంగాని పరిస్థితి. గోతులమయమైన దారిలో ప్రయాణం సాగించలేక జనం నరకయాతన పడుతున్నారు.
ఆ రోడ్డుపై ప్రయాణం కష్టమే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బళ్లారి నుంచి పావగడ, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి అధ్వానంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేగాక బళ్లారి నుంచి బొమ్మనహాల్, ఎత్తినబూదిహాల్, మంగమ్మక్యాంపు, మురిడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే వాహనాలు ఇదే దారిలో వెళ్తుంటాయి. ఈ రహదారిపై ప్రస్తుతం గోతులు ఏర్పడి వాహనదారులు నరకయాతన పడుతున్నారు. బళ్లారి నగర శివారులోని కణేకల్లు బస్టాండు నుంచి గోశాల, ఆంధ్రా మీదుగా మంగమ్మ క్యాంపు వరకూ రోడ్డును విస్తరించాలని సర్కారు తలపెట్టింది. దీంతో ప్రజా పనుల శాఖ(పీడబ్ల్యూడీ) నుంచి రూ.10 కోట్ల నిధులు విడుదల చేసింది.
అడుగు పడని పనులు
ముఖ్యమైన రహదారిపై ఎక్కడ చూసినా గోతులు ఏర్పడడంతో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. అధికారులు, సంబంధిత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే.. తమకు శాపంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్లు, బస్సుల్లో వెళ్లే వారేగాక ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారింది. నిధులు విడుదల చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలు చూపి పనులు ఆలస్యంగా చేయకుండా వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
బళ్లారి – కళ్యాణదుర్గం రోడ్డుపై జనం నరకయాతన
గోశాల నుంచి మంగమ్మ క్యాంపు వరకు గోతులమయం
రహదారి అధ్వానం
కళ్యాణదుర్గం, బళ్లారి నుంచి పావగడ, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు దుస్థితిపై పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందన కరవైంది. నిధులు విడుదలైనా సాంకేతిక కారణాలు చూపి పనులు ఆలస్యం చేస్తున్నారు. తక్షణమే పనులు ప్రారంభించాలి.
– వెంకటరెడ్డి, సామాజిక కార్యకర్త
నిధులు పుష్కలం.. రహదారి అధ్వానం


