వస్త్ర కర్మాగారాలపై సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, బళ్లారి: జిల్లాలో జీన్స్ వస్త్ర పరిశ్రమలను నమ్ముకొని దుస్తులను తయారు చేస్తూ వేలాది జీవిస్తున్నారని, అలాంటి జీన్స్ తయారీ కేంద్రాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మోకా రోడ్డు వాజ్‌పేయి లేఔట్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా పెట్టింది పేరుగా ఉన్న బళ్లారి జీన్స్ వస్త్ర పరిశ్రమలకు విఘాతం కలిగించేలా రాత్రికి రాత్రి చర్యలు తీసుకొన్నారని మండిపడ్డారు. బళ్లారిని జీన్స్ హబ్ చేస్తామని రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకు పురోగతి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. ఇంకా పూర్తి స్థాయిలో భూమిని కూడా కొనుగోలు చేయలేదన్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల 600లకు పైగా ఉన్న జీన్స్ వస్త్ర పరిశ్రమల్లో యజమానులు కూడా పర్యావరణ పరిరక్షణకు హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అయినా పరిశ్రమలు సగానికి సగం తగ్గిపోయాయన్నారు. ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలన్నారు. నగర శివార్లలోని గోనాళ్ వద్ద నూతనంగా 104 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న బుడా లేఔట్ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదన్నారు. సత్వరమే పూర్తి చేసి పేదలకు స్థలాలు పంపిణీ చేయాలన్నారు. నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందన్నారు. ఉన్నఫళంగా అధికారులు ఎందుకు ఇసుక తవ్వకాలు, సరఫరా నిలుపుదల చేశారు? అని ప్రశ్నించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. మాజీ మేయర్ వెంకటరమణ, కార్పొరేటర్లు మోత్కూర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి


