ఏకతా దివస్ ర్యాలీకి శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏకతా దివస్ ర్యాలీకి రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ పచ్చజెండా ఊపి శ్రీకారం చుట్టారు. గురువారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞావిధి స్వీకరించి ర్యాలీ చేపట్టారు. మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, గౌతమ్ రెడ్డి, పవన్ పాటిల్, సంతోష్ కుమార్, ఆంజనేయ, విరుపాక్షప్ప, మహేంద్ర రెడ్డి, విద్యాసాగర్, నరసారెడ్డిలున్నారు.
హంపీ కన్నడ వర్సిటీలో..
హొసపేటె: జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా గురువారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది. నవంబర్ 19 నుంచి 25 వరకు జాతీయ ఐక్యతా వారోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వర్సిటీలోని క్రియాశక్తి భవనం సిండికేట్ హాల్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ డి.ప్రభ జాతీయ ఐక్యతా ప్రమాణం చేయించారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.వై.సోమశేఖర్, వివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
25న ఏక్తా యాత్ర
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మై భారత్ ద్వారా వికాసిత భారత్ ఏక్తా పాదయాత్ర ఈ నెల 25న నగరంలో నిర్వహిస్తామని జిల్లా యువ భారత్ జిల్లా అధ్యక్షులు ముఖ్య సంజ్జే తెలిపారు. దేశభక్తిని ప్రోత్సహించడం, యువతలో ఐక్యత స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. పాదగట్టి ఆంజనేయ దేవస్థానం నుంచి ప్రారంభమై నగరం గుండా సాగుతుందని చెప్పారు.


