జీన్స్ యూనిట్ల యజమానులకు ఊరట
బళ్లారి అర్బన్: అనుమతుల సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులకు, కష్టనష్టాలకు గురవుతున్న బళ్లారి జీన్స్ దుస్తుల తయారీ యూనిట్ల యజమానుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈమేరకు గురువారం ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొన్న పలు ప్రముఖ నిర్ణయాలను వెల్లడించారు. ఈటీపీ వ్యవస్థ కలిగిన యూనిట్లకు పర్యావరణ శాఖ తక్షణం అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. దీంతో తమ వ్యాపారాలపై అగమ్య గోచర స్థితిలో ఉన్న యజమానులకు కాసింత ఊరట, ధైర్యం కలిగిందన్నారు. అంతేగాక సీఈటీపీ స్థాపన కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. కేఏఐడీబీ తరఫున రూ.11 కోట్లు, కేకేఆర్‌డీబీ ద్వారా రూ.11 కోట్లు కలిపి మొత్తం రూ.22 కోట్లు మంజూరైందన్నారు. సీఈటీపీ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. ఈ కీలక నిర్ణయంతో నగరంలో పని చేస్తున్న 53 జీన్స్ సంస్థల యజమానుల మనోబలం రెట్టింపు అయ్యిందన్నారు. సుదీర్ఘకాలం నుంచి అనుమతుల కోసం, పర్యావరణ సంబంధిత కార్యాచరణ సమస్యలతో ఆవేదనకు గురువుతున్న సదరు యజమానులకు ఈ నిర్ణయం వల్ల చాలా ప్రయోజనం చేకూరనుందన్నారు. మేయర్ గాదెప్ప, బీఆర్‌ఎల్ సీనా, లేబల్ రాజు, మల్లికార్జునగౌడ, మురళి, వినయ్, దాదా ఖలందర్, రాఖీ అశోక్, పొలక్స్ మల్లికార్జున, రాజేశ్వరి సుబ్బరాయుడు, వెంకటేష్ హెగ్డే, చానాళ్ శేఖర్, ఈరణ్ణగౌడ, బోయపాటి విష్ణువర్ధన్ తదితర 53 జీన్స్ వస్త్ర సంస్థల అధినేతలు పాల్గొన్నారు.
సమస్యలపై సీఎం సానుకూల స్పందన
సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వెల్లడి


