26న భూమి, వసతి కోసం బెంగళూరు చలో
బళ్లారి టౌన్: పేదలకు భూమి, వసతి హక్కులను ఇవ్వాలని నవంబర్ 26న బెంగళూరు చలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు భూమి, వసతి హక్కు వంచితుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కరియప్ప గుడిమని పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో ధర్నా చేపట్టి తమకు ఖచ్చితమైన హామీ లభించేంత వరకు ఆందోళనను విరమించేది లేదన్నారు. రాష్ట్రంలో బగర్‌హుకుం సాగుదారులు, వసతి హక్కుల నుంచి వంచితులైన వేలాది కుటుంబాలకు శాశ్వతంగా సమస్య పరిష్కరించాలని, వన్‌టైం సెటిల్‌మెంట్ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా పేదలకు ఎకరా భూమి కూడా లేదన్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాలు కూడా లేవని అన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చేతులు ఎత్తేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళితే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. నేతలు ఈశ్వరప్ప, విశ్వనాథ, రామకృష్ణ, మహేష్, వసంతరాజు, ప్రభాకర్‌రెడ్డి, అసుండి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.


