
విలేకరులపై దాడులు అరికట్టండి
రాయచూరు రూరల్: జిల్లాలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకా అరికెరలోని గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికెళ్లి ఫొటోలు తీస్తుండగా ప్రిన్సిపాల్ సురేష్ వర్మ పాత్రికేయులను ఏకవచనంతో దుర్భాషలాడారన్నారు. వెంటనే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థిని హత్య ఖండిస్తూ ధర్నా
చెళ్లకెరె రూరల్: చిత్రదుర్గ జిల్లా గోనూరు సమీపంలో జరిగిన విద్యార్థిని వర్షిత హత్యను ఖండిస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా జరిపారు. దళిత నాయకుడు టీ.విజయ్‌కుమార్ మాట్లాడుతూ పోలీసులు ఇప్పటికే చేతన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని వర్షితను హింసించి అమానుషంగా హత్య చేసిన వారికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. వర్షిత కుటుంబానికి ఒక ఎకరం భూమి, ఇంటి స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు కూడా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని ఒత్తిడి చేశారు. దళిత నాయకులు హొన్నూరు స్వామి, భీమన్న, తిప్పేస్వామి, ఆనంద్, పాలాక్ష, జగదీష్, కేబీ నాగరాజ్ పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పురాణ ప్రవచనం
హుబ్లీ: కంప్లిలోని సాంగత్రయ సంస్కృత పాఠశాలలో ఏర్పాటు చేసిన కలబుర్గి శరణ బసవేశ్వర లీలామృత పురాణ ప్రవచనం ఆదివారం భక్తిశ్రద్ధలతో ముగిసింది. ఈ సందర్భంగా బోచ్చయ్య స్వామి గురుసిద్ద మరిదేవర సన్నిధిలో రుద్రాభిషేకం, విశేష పూజలు, తుంగభద్ర నది నుంచి శరణ బసవేశ్వరుని విగ్రహ ప్రదర్శన ఊరేగింపు తదితర ధార్మిక కార్యక్రమాలు అపార సంఖ్యలో చేరిన భక్తుల సమక్షంలో నెరవేరాయి. సదరు పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి, బళ్లారి గోపి రక్తనిధి సహకారంతో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖులు ఇటిగి బసవరాజ గౌడ, సురేష్‌గౌడ, శివమూర్తి స్వామి, అక్కమహాదేవి మహిళా మండలి సభ్యులు, వీరశైవ సమాజ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతులకు
రిజర్వేషన్ కల్పించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ కల్పనలో భాగంగా సంచార జాతులకు ఒక శాతం రిజర్వేషన్ ప్రకటించాలని రాయచూరు మురికి వాడల క్రియా వేదిక డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఆందోళన చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ జిస్టిస్ నాగమోహనదాస్ నివేదిక ఆధారంగా తమకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
మత మార్పిడి ఆరోపణలతో ప్రార్థనలకు అడ్డంకులు
హుబ్లీ: ఒత్తిడి పూర్వకంగా హిందువులను మత మార్పిడి చేస్తున్నారని ఆరోపిస్తూ భజరంగదళ కార్యకర్తలు సోమవారం దాడి చేసిన రెండు చోట్ల ఉపనగర పోలీసులు వెళ్లి పరిశీలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ధార్వాడ కోర్టు సర్కిల్ దగ్గరలోని ఓ భవనంలో బెళగావి వ్యక్తి 20 మందితో ప్రార్థనలు చేయిస్తున్నారనే ఆరోపణలతో అక్కడికి వచ్చిన సదరు కార్యకర్తలు ప్రార్థనను అడ్డుకొని బంద్ చేయించారు. అలాగే కాలేజ్ రోడ్డు ఎల్‌ఐసీ సమీపంలోని ఓ భవనంలో జరుపుతున్న ప్రార్థనలను కూడా అడ్డుకొని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భజరంగదళ్ టౌన్ శాఖ అధ్యక్షుడు సిద్దయ్య హిరేమఠ నేతృత్వంలో 8 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా ఆ మతస్తులతో మాటల ఘర్షణ పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు సమాచారం అందుకొని ఆరోపణలు ప్రత్యారోపణల వివరాలను తీసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలిసింది.

విలేకరులపై దాడులు అరికట్టండి

విలేకరులపై దాడులు అరికట్టండి

విలేకరులపై దాడులు అరికట్టండి