
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలకు సిద్ధపడ్డారు. కానీ, ఆ క్షమాపణలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదని.. నిజంగా ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే చెబుతానని అంటున్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇదే పని వేరే ఎవరైనా చేసి ఉంటే.. ఈ పాటికి కాంగ్రెస్ చర్యలు తీసుకునే ఉండేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా డీకే స్పందించారు.
‘‘బీజేపీని విమర్శించేందుకే నేను ఆ పాట పాడాను. కానీ కొందరు దీనిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడిఉంటే.. అందుకు చింతిస్తున్నాను. నేను క్షమాపణలు చెప్తాను. అయితే అవి రాజకీయ ఒత్తిడివల్ల చెప్పే క్షమాపణలు కాదు అని అన్నారాయన.
అలాగే గాంధీ కుటుంబం (Sonia Gandhi family), కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం. నేను వారి భక్తుడిని అని స్పష్టం చేశారు.
ఇటీవల అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై చర్చ నడిచింది. ఆ సమయంలో డీకే శివకుమార్ విపక్షాల విమర్శలకు బదులిస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్ గేయాన్ని ఆలపించారు. ‘నమస్తే సదా వస్తలే మాతృభూమే’ అంటూ ఆయన నోట రావడంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ వారు నినదించారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆ పరిణామాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు.