
రోడ్ల పనుల సత్వర పూర్తికి సూచన
రాయచూరు రూరల్ : జిల్లాలో రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. మంగళవారం సిరవార– దేవదుర్గ రోడ్డు పనులపై అధికారులతో చర్చించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తగదన్నారు. సిరవార, మాన్వి క్రాస్ వద్ద నిలిచిన నీటిని చూసి ఆక్రోశం వ్యక్తం చేశారు. నూతన సిరవార తాలూకా అభివృద్ధికి కల్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ) నుంచి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మల్లట్‌లో రూ.17 కోట్లతో జరిగే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.
ధర్మస్థలపై దుష్ప్రచారం అరికట్టాలి
రాయచూరు రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై వస్తున్న దుష్ప్రచారాలను నిషేధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థలలో వెలసిన మంజునాథ స్వామి క్షేత్రంలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలని ఒత్తిడి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపప్రచారాన్ని నిలపాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించిన సమయంలో అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు కళ్లెం వేయాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ తొలగించాలని సంతకాల సేకరణ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు కేటాయించిన ఫేస్ రీడింగ్ స్కీం(ఎఫ్‌ఆర్‌ఎస్)ను తొలగించాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రధాన తపాలా శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయడం వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణను చేపట్టి ప్రభుత్వానికి రక్తంతో కూడిన కార్డులను తపాలా శాఖ పెట్టెలో పోస్టు చేశారు.
ఘనంగా వీరభద్రేశ్వర జయంతి
రాయచూరు రూరల్: నగరంలో వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం బెస్తవార పేటలో వెలసిన వీరభద్రేశ్వర ఆలయంలో అర్చకులు శశికుమార్ స్వామి, శరణయ్య స్వామి అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు వీరభద్ర, కాళికా దేవిల పల్లకీ సేవలు నెరవేర్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

రోడ్ల పనుల సత్వర పూర్తికి సూచన

రోడ్ల పనుల సత్వర పూర్తికి సూచన