
వినాయక చవితికి సర్వం సిద్ధం
సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా గణనాథులను ప్రతిష్టించి పూజలు చేసేందుకు భక్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భాద్రపద మాసం చవితి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గణనాథులను ఏర్పాటు చేసుకుని పూజలు చేసేందుకు భక్తులు ఎవరికి వారు ఉత్సాహంగా సర్వం సిద్ధం చేసుకున్నారు. నగరంలోని ప్రతి వార్డు, కాలనీల్లో వినాయకులను మూడు లేదా ఐదు రోజుల పాటు ప్రతిష్టించి పూజలు చేసేందుకు ఆయా వినాయక భక్త మండళ్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టారు. గణనాథులను ఏర్పాటు చేసే మండపాల వద్ద పగటి వేళను తలపించే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.
భక్తిశ్రద్ధలతో పూజలు
లోకంలో తొలి పూజలు అందుకునే గణనాథుడి పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. వాడవాడలతో పాటు నగరంలో ఇంటింటా గణనాథులను ప్రతిష్టించి పూజలు చేసుకునేందుకు మంగళవారం ఉదయం నుంచి నగరంలోని బెంగళూరు రోడ్డు, కనక దుర్గమ్మ ఆలయం, మోకా రోడ్డు తదితర ప్రధాన రహదారుల్లో ఉంచిన గణనాథులను కొనుగోలు చేసుకుని, సంబంధిత పూజా సామగ్రిని కూడా కొనుగోలు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆయా ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. వినాయక చవితి సందర్భంగా పూలు, పండ్లు తదితర పూజా సామగ్రికి భలే గిరాకీ ఏర్పడింది.
వాడవాడలా కొలువైన గణనాథులు
ఇంటింటా గణేష్ పూజలకు ఏర్పాట్లు
పూలు, పండ్లు, పూజా సామగ్రికి భారీగా డిమాండ్
కొనుగోలుదారులతో నగర మార్కెట్లు రద్దీ
జోరుగా పూజా సామగ్రి కొనుగోలు
పూలు, పండ్లు, అరటిగెలలు, మామిడి ఆకులు, గరిక, చెరుకు గడలు, ఎలక్కాయలు, మొక్కజొన్న కంకులు తదితరాలను కొనుగోలు చేసి వినాయకుడి ముందు ఉంచి పూజలు చేసేందుకు తీసుకెళ్లారు. వినాయక చవితి రోజున గణనాథుడికి ఇష్టమైన వాటిని ఉంచి పూజలు చేస్తే మంచి జరుగుతుందనే భక్తుల్లో విశ్వాసం, నమ్మకం ఉండటంతో భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వినాయక చవితి నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో జిల్లా ఎస్పీ శోభారాణి ఆధ్వర్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించే స్థలాల్లో భద్రత, ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.