
హిందూపురం వివాహిత మృతి కేసులో వీడిన మిస్టరీ
బంగారం కోసమే హతమార్చినట్లు నిర్ధారణ
ఇద్దరి అరెస్టు
గౌరీబిదనూరు (కర్ణాటక): ఇటీవల కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా పరిధిలో లభ్యమైన అపరిచిత మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. హతురాలిని హిందూపురం ప్రాంతానికి చెందిన అర్చనగా నిర్ధారించిన పోలీసులు ఆమెను హతమార్చిన ఓ యువకుడు, యువతిని అరెస్టు చేశారు. మంగళవారం గౌరీబిదనూరు తాలూకా మంచేనహళ్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను పోలీసులు వెల్లడించారు. హిందూపురం సమీపంలోని శ్రీకంఠాపురానికి చెందిన వడ్డే అర్చన (27) క్యాటరింగ్ పని చేసేది. ఈ నెల 14న పనికి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో అర్చన భర్త ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
చున్నీతో గొంతు నులిమి..
అర్చనకు కేటరింగ్ పనిలో బెంగళూరుకు చెందిన రాకేష్, అంజలితో పరిచయం ఏర్పడింది. అందరూ ఆప్త స్నేహితులుగా మెలిగేవారు. హిందూపురం, బెంగళూరులో ఎక్కడ కేటరింగ్ పనులు ఉన్నా కలిసి వెళ్లేవారు. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్న రాకేష్‌కు అర్చన ధరించే బంగారు నగలపై ఆశ పుట్టింది. 14న అర్చనను పని ఉందని రాకేష్ పిలిపించుకున్నాడు. అనంతరం కారులో చిలమత్తూరు, లేపాక్షి, పెరేసంద్ర, గౌరీబిదనూరు తదితర ప్రాంతాల్లో తిప్పి చివరకు నామగొండ్లు సమీపంలో చున్నీతో ఆమె గొంతు బిగించి హతమార్చాడు. ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఓ వంతెన కింద పడేసి.. ఎవరూ గుర్తించకుండా బండరాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి ఉడాయించాడు. అనంతరం బంగారాన్ని రూ. 1.95 లక్షలకు కుదువపెట్టి తన ఆటో రుణం కంతు చెల్లించాడు.
పరారీలో డ్రైవర్, మరో యువతి
ఈ నెల 17న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ఫిర్యాదు మేరకు మంచేనహళ్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతరం హతురాలిని హిందూపురానికి చెందిన అర్చనగా నిర్ధారించారు. ఈ క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారు. ఆమెకు అందిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవం బయటపడింది. దీంతో రాకేష్‌తో పాటు అతనికి సాయపడిన అంజలిని మంగళవారం అరెస్ట్ చేసి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన కారు డ్రైవర్ నవీన్, మరో నిందితురాలు నిహారిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.