
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్‌పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు.

రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్
చైన్‌స్నాచర్ టు కానిస్టేబుల్ హత్య..
చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్ 17వ) తేదీన నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్‌ఐ భీమ్‌రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు.
అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్‌ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు.

ఎన్‌కౌంటర్ అంటూ ప్రచారం..
శుక్రవారం ప్రమోద్‌ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే..
ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్‌లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్‌లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్ ఎన్‌కౌంటర్ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు.
నిందితుడు రియాజ్‌ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్‌ను కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయే క్రమంలో ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా?