
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.
పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్‌గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్‌ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.