
నిజామాబాద్: సైబర్ క్రైమ్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. తాము ఆర్థిక వ్యవహారాలు చూసే ఆషీసర్లుగా చెప్పుకుంటూ సామాన్య ప్రజల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు. తాము ఫలాన ప్రభుత్వ ఆపీసు నుంచి పోన్ చేస్తున్నామని, తాము అందులో అధికారులమని డ్రామాకు తెరలేపుతున్నారు. దాంతో అకౌంట్‌లో అవసరాల కోసం డబ్బు దాచుకున్న వారు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల ఇంకాస్త భయపెట్టి.. ప్రజల అకౌంట్ల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు.
తాజాగా నిజామాబాద్‌లో సైబర్ నేరగాళ్లు.. ఒక కుటుంబానికి ఫోన్ చేసి రూ. 10 లక్షల వరకూ లాగేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సదరు కుటుంబాన్ని బెదిరించి.. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. రూ. 30 లక్షలు ఇవ్వకపోతే అరెస్ట్ కావాల్సి వస్తుందంటూ భయపెట్టారు. దాంతోభయపడిపోయిన ఆ కుటుంబం నుంచి రూ. 10 లక్షలను కాజేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ సైబర్ నేరగాళ్ల అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు పోలీసులు.
ఈ తరహా మోసాలకు బలి కావొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా, కాలర్ ట్యూన్స్ రూపంలో మనకు రోజుకు వినిపిస్తున్నా ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదు. దాంతో అకౌంట్‌లో అవసరాల కోసం డబ్బులు దాచుకున్న వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అసలు ఎవరు ఫోన్ చేశారు.. ఎందుకు ఫోన్ చేశారు అనే దానిపై కాస్త ఆగి ఆడుగులు వేస్తే లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేసే పరిస్థితి ఉండదు. ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు, పదే పదే వేధింపులకు గురౌవుతున్నప్పుడు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యకు ఆదిలోనే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. చేతులు కాలిపోయాక.. ఆకులు పట్టుకుంటే ఎంత వరకూ ప్రయోజనం ఉంటుందనేది ప్రజలు ఆలోచించాలనేది విశ్లేషకుల మాట.