
పెద్ద గుల్లా తండాలో విషాదం
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్‌గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు.
తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్‌కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.