సెలూన్‌ ముసుగులో వ్యభిచారం | Prostitution Racket Busted in Spa Centre | Sakshi
Sakshi News home page

సెలూన్‌ ముసుగులో వ్యభిచారం

Mar 19 2026 8:09 AM | Updated on Mar 19 2026 11:44 AM

Prostitution Racket Busted in Spa Centre

విశాఖపట్నం: ఎన్‌ఏడీ జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్‌ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. 

ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్‌ ఉన్న భవనంలో హెయిర్‌ పోర్ట్‌ సెలూన్‌ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్‌ కటింగ్‌ లేదా మసాజ్‌ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్‌కు వస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. 

అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్‌ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్‌కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 నిందితులను ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్‌ఏడీ జంక్షన్‌ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్‌లో ఉన్న ఎలైట్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా సెంటర్‌పై కూడా టాస్క్‌ ఫోర్స్, ఎయిర్‌ పోర్ట్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే.   

Advertisement
 
Advertisement
Advertisement