
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మరణించిన రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో అతగాడు దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.
జీజీహెచ్ ఆస్పత్రి మార్చురీలో గత అర్ధరాత్రి దాకా రియాజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుండి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బోధన్ రోడ్డులో గల స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
రియాజ్(24)పై 40 కేసులతో(దొంగతనాలు, దాడులు) పాటు రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీన అతని గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) సిబ్బంది ఇద్దరు రంగంలోకి దిగారు. అయితే అతన్ని బైక్‌పై తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్(48)ను తన దగ్గర ఉన్న కత్తితో పొడిచి పరారయ్యాడు. రెండ్రోజుల పాటు 8 పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ ఘటనను రాష్ట్ర పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. అయితే..
రెండ్రోజుల తర్వాత ఆదివారం.. అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ క్రమంలో గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఖైదీల వార్డులో చికిత్స చేయించారు. అయితే సోమవారం ఉదయం తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వద్ద గన్ లాక్కునే ప్రయత్నం చేసి పారిపోసాగాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు దిగడంతో బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ.. రియాజ్ కాల్పులకు దిగి ఉంటే మరిన్ని ప్రాణాలు పోయి ఉండేవని, పోలీసులు సకాలంలో స్పందించారని అన్నారు. మరణించిన ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయాల ఆర్థిక సాయం , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారాయన.
ఇదీ చదవండి: తెలంగాణ మంత్రి వద్ద సీనియర్ నేత ఆవేదన చూశారా?