
చుట్టూ జనం ఉన్నా సాయానికి ఒక్కరూ ముందుకు రాని వైనం
ఎస్‌ఐ అరగంటపాటు బతిమాలినా అడుగు ముందుకేయని జనం
మొబైల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తూ బాధ్యతారాహిత్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపద వస్తే పోలీసు కావాలి.. వెంటనే రావాలి.. అలాంటి పోలీసుకు ప్రాణాపాయ స్థితి వస్తే మాత్రం చోద్యం చూడాలి.. నిజామాబాద్ నగరం నడిబొడ్డున శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతం సమాజంలో కొడిగడుతున్న మానవత్వాన్ని, పౌర బాధ్యతలను మరోసారి ఎత్తిచూపింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెల్లో దుండగుడు కత్తితో పొడిస్తే చుట్టూ వందలమంది గుడ్లప్పగించి చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయాలని పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విఠల్ అరగంటపాటు బతిమాలినా ఒక్కరూ అడుగు ముందుకేయలేదు. పైగా ఏదో వేడుక జరుగుతున్నట్లు తమ మొబైళ్లలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ గడిపారు. ఆటోవాలాలు సైతం సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. సుమారు 30 నిమిషాలపాటు ఎస్‌ఐ విఠల్ ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ స్పందించలేదు. అటువైపు నుంచి వెళ్తున్న ఓ అంబులెన్స్‌ను ఆపినప్పటికీ ఆపకుండా వెళ్లడం గమనార్హం.
చివరికి ఆదుకున్నది పోలీసే..
వినాయక నగర్ మీదుగా తన వాహనంలో వెళ్తున్న మోపాల్ మండల సబ్‌ఇన్‌స్పెక్టర్ సుస్మిత జనం గుమిగూడి ఉండడాన్ని చూసి ఆగారు. కత్తిపోటుకు గురైంది కానిస్టేబుల్ ప్రమోద్ అనే విషయం తెలియకపోయినా తన వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించి ప్రమోద్ మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రజల తీరుపై పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమాజానికి భద్రత కల్పిస్తున్న తమకే ఆపదలో సహాయం చేయటానికి ఒక్కరూ ముందుకు రాలేదని ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగొద్దు
పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర విచారకరం. ఈ చర్యను ఖండిస్తున్నాం. విధి నిర్వహ ణలో ప్రమోద్ చేసిన త్యాగం అత్యున్నతమైనది. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న శాంతిభద్రతల విభాగంలో పోలీసు సిబ్బందికే భద్రత లేకుండా పోయింది. రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరిగే స్థాయికి శాంతిభద్రతలు దిగజారడం శోచనీయం. రౌడీషీటర్ షేక్ రియాజ్‌ను తక్షణమే పట్టుకోవాలి. అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగకుండా, కరడుగట్టిన నేరస్తులకు అత్యంత కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వం ముందుకెళ్లాలి.
– ధర్మపురి అర్వింద్, ఎంపీ
కానిస్టేబుల్ హత్యపై డీజీపీ సీరియస్
ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఐజీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రమోద్‌పై ఒక చైన్ స్నాచర్ దాడి చేసి హత్య చేసిన సంఘటనను డీజీపీ బి.శివధర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకు న్నారు. సిన్సియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్‌ను సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయా లని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదే శించారు. మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షి ంచాలని సూచించారు. మరణించిన కానిస్టే బుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. లభించిన ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీచేశారు.