హనుమకొండ జిల్లా కడిపికొండలో ఘటన
స్వల్పంగా గాయపడిన బాధితురాలు.. ఎంజీఎంలో చికిత్స
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో సోమవారం యువతిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. స్థానికులు, మడికొండ పోలీసులు వివరాలు తెలిపారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన సునంద హనుమకొండ పద్మాక్షి కాలనీలోని జయ నర్సింగ్ హోం కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండగా హాల్‌టికెట్ కోసం సోమవారం కళాశాలకు వచ్చింది.
చీకటి పడటంతో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చి పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. కడిపికొండ మీదుగా తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలితో కలిసి బయల్దేరింది. కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపానికి చేరుకోగా.. అప్పటికే మాటువేసిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం నడుపుతున్న యువతిపై యాసిడ్ దాడిచేసి పారిపోయారు. కాగా, యువతి ధరించిన హెల్మెట్‌పై నుంచి యాసిడ్ కాలిపై పడటంతో స్వల్పంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ప్రభావం చూపే యాసిడా లేదా బ్యాటరీలో పోసే కెమికలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారమా, పాత కక్షలా అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కడిపికొండ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల ఆచూకీ తెలియలేదు. పోలీసులు వివిధ దుకాణాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే నిందితుల ఆచూకీ లభించేది. హనుమకొండలో 2008, డిసెంబర్ 10న స్వప్నిక, ప్రణీతపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసిన ఘటనను నేటికీ నగరవాసులు మర్చిపోలేదు. సోమవారం చోటుచేసుకున్న యాసిడ్ దాడితో నగరం ఉలిక్కిపడింది.


