‘కోచింగ్‌ సెంటర్‌’ లవ్‌ స్టోరీ.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌ | Jogulamba Gadwal District: Constable Cheats Woman In The Name Of Love | Sakshi
Sakshi News home page

‘కోచింగ్‌ సెంటర్‌’ లవ్‌ స్టోరీ.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Jul 23 2025 7:23 PM | Updated on Jul 23 2025 7:59 PM

Jogulamba Gadwal District: Constable Cheats Woman In The Name Of Love

గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్‌ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్‌కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్‌గౌడ్‌ సైతం శిక్షణ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్‌గౌడ్‌ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్‌లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్‌గౌడ్‌ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.

తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్‌గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేశాం.. 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ రఘునాథ్‌గౌడ్‌పై గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్‌ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement