
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అరెస్టు
విడపనకల్లు: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన దూషణలపై ప్రాంతాలకు అతీతంగా అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేది కండకావరమని, తక్షణం క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఆదివారం కర్ణాటకలోని బళ్లారి నుంచి అనంతపురానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన దీక్ష కోసం 40 మంది దాకా ఎనిమిది వాహనాల్లో తరలివెళ్తున్నారు. సమాచారం అందుకున్న ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు ఎస్‌ఐ ఖాజా హుస్సేన్, పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్ణాటక అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు అధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్తుంటే, ఆంధ్ర సరిహద్దులో పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేశారని అభిమానులు ఆరోపించారు. ఆంధ్రలో నిరసన తెలపడానికి కూడా స్వేచ్ఛ లేదా? అని పోలీసుల తీరును తప్పు బట్టారు. బేషరతుగా ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అరెస్టు