గేట్ల ఏర్పాటులో సర్కార్‌ ఉదాసీనత | - | Sakshi
Sakshi News home page

గేట్ల ఏర్పాటులో సర్కార్‌ ఉదాసీనత

Aug 26 2025 7:58 AM | Updated on Aug 26 2025 7:58 AM

గేట్ల

గేట్ల ఏర్పాటులో సర్కార్‌ ఉదాసీనత

హొసపేటె: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు డ్యాం నుంచి వృథాగా సుమారు 188 టీఎంసీల మేర నీరు దిగువకు వెళ్లిందని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. సోమవారం ఆయన తుంగభద్ర డ్యాం వద్ద క్రస్ట్‌గేట్లను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డ్యాం గేట్ల పరిస్థితిపై చర్చించగా, కొందరు రైతులు డ్యాంను పరిశీలించాలని కోరిన కోరిక మేరకు డ్యాం గేట్ల వీక్షణకు వచ్చానన్నారు. తాను తుంగభద్ర డ్యాం సందర్శనకు వెళ్లే విషయం గురించి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు తెలిపామన్నారు. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయినప్పుడు డ్యాం వద్దకు వచ్చానని, తిరిగి ఈ రోజు మరొకసారి డ్యాంకు వచ్చానన్నారు.

డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం డ్యాంలో 80 టీఎంసీలను మాత్రమే బోర్డు అధికారులు నిల్వ ఉంచారన్నారు. ఈ విషయంపై బోర్డు అధికారులను అడిగితే గేట్లు బలహీనంగా ఉండటం వల్ల సాంకేతిక సమస్య ఎదురైందని తెలిపారన్నారు. ఈ సారి డ్యాంకు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చిందన్నారు. కానీ డ్యాం గేట్ల దుస్థితి వల్ల ఆ నీటిని కాపాడుకోలేక పోయామన్నారు. డ్యాంలో దాదాపు అన్ని గేట్లు డ్యామేజ్‌ అయ్యాయని తెలిపారు. 40 ఏళ్ల లోపు అన్ని గేట్లు మార్చాలని నిపుణులు తెలిపినా నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులకు శాపంగా మారిందన్నారు. డ్యాంలోని అన్ని గేట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.52 కోట్లను కేటాయించి గేట్ల నిర్మాణ పనులు సత్వరం చేపట్టక పోవడం వల్ల నేడు రైతులకు రెండో పంటకు నీరు లేకుండా పోతోందన్నారు.

ఈ విషయంపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు పెద్ద ఎత్తున డ్యాంలో నీటినిల్వ ఉండేదన్నారు. కానీ అధికార ప్రభుత్వానికి బిహార్‌ ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలు మాత్రమే ముఖ్యం అయ్యాయన్నారు. డ్యాం గేట్ల మార్పిడిపై సర్కారు పెద్దలకు ఎలాంటి శ్రద్ధ లేదని అన్నారు. ఈ రోజు రైతులకు రెండో పంటలకు నీరు అందక పోవడానికి అధికార పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతుల సుమారు 6 నుంచి 7 లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరు లేకుండా పోయిందన్నారు. సరైన సమయంలో గేట్ల పనులు ప్రారంభించలేక పోయారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పరణ్ణ మునవళ్లి, దడేసూగూరు బసవరాజ్‌ పాల్గొన్నారు.

తుంగభద్ర డ్యాంను పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత అశోక్‌

మాట్లాడుతున్న చామరస మాలిపాటిల్‌

టీబీ డ్యాం గేట్ల మార్పిడిలో సర్కార్‌ నిర్లక్ష్యం

మండలి అధికారుల నిర్లక్ష్యంతో

డ్యాం గేట్‌ టెండర్‌ ఆలస్యం

ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే

మేల్కొనాలి: ప్రతిపక్ష నేత అశోక్‌

సర్కారు నిర్లక్ష్యమే రైతులకు శాపం

బిహార్‌ ఎన్నికలపైనే దృష్టంతా

రాయచూరు రూరల్‌: తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్‌ ఆరోిపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్‌గేట్‌ తెగిపోవడంతో నిపుణులు మిగిలిన 32 గేట్లను కూడా వెంటనే మార్చాలని సూచించినా సర్కార్‌ వారి సూచనలను పెడచెవిన పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య గేట్ల అమరికకు చర్యలు చేపట్టడంలో బేజవాబ్దారిగా వ్యవహరించారన్నారు. డ్యాంలో 30 శాతం పూడిక పేరుకుందన్నారు. డ్యాం పరిధిలో సిబ్బంది కొరత ఉందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌తో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచాలని డిమాండ్‌ చేశారు.

గేట్ల ఏర్పాటులో సర్కార్‌ ఉదాసీనత1
1/1

గేట్ల ఏర్పాటులో సర్కార్‌ ఉదాసీనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement