
పదిహేడేళ్ల సుదీర్ఘ కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ ఏడాది నెరవేర్చుకుంది. అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ (IPL 2025) ట్రోఫీని ఎట్టకేలకు ముద్దాడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్సీబీ ఫ్రాంఛైజీ సైతం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. విజయయాత్రను ఘనంగా చేసుకోవాలని భావించింది.
తీవ్ర విషాదం
అయితే, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తీరని విషాదం నెలకొంది. టైటిల్ గెలిచి తిరిగివచ్చిన ఆర్సీబీ ప్లేయర్లను స్వాగతించే క్రమంలో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరుగగా.. పదకొండు మంది మృత్యువాత పడగా.. యాభై మందికి పైగా గాయాలపాలయ్యారు.
తప్పంతా ఆర్సీబీదే
ఈ విషాదకర ఘటన విచారణలో భాగంగా.. తప్పంతా ఆర్సీబీదేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) తేల్చింది. పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండా.. సోషల్ మీడియా వేదికగా విజయోత్సవం గురించి పోస్ట్ పెట్టి.. దుర్ఘటనకు కారణమయ్యారని ఆర్సీబీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను జూన్‌లో అరెస్టు చేశారు.
అయితే, విజయోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై స్పందిస్తూ ఆర్సీబీ జూన్ 5న ఓ పోస్టు పెట్టింది. ‘ఆర్సీబీ కేర్స్’ ద్వారా గాయపడిన అభిమానులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మిన్నకుండిపోయిన ఆర్సీబీ సోషల్ మీడియా అకౌంట్‌లో తాజాగా ఓ పోస్టు ప్రత్యక్షమైంది.
నిశ్శబ్దంగా ఉన్నంతమాత్రాన..
‘‘ప్రియమైన 12th మ్యాన్ ఆర్మీ (ఆర్సీబీ అభిమానులు).. ఈ హృదయపూర్వక లేఖ మీ కోసమే. దాదాపు మూడు నెలలుగా మేము ఇక్కడ ఎలాంటి పోస్టు చేయలేదు. మేమిలా నిశ్శబ్దంగా ఉన్నంతమాత్రాన.. ఇది మా గైర్హాజరీ మాత్రమే అనుకోవద్దు.
నిజానికి మేము విషాదం నుంచి కోలుకోలేకపోయాము. ఇక్కడ ఒకప్పుడు మన శక్తి, అందమైన జ్ఞాపకాలు, అద్భుతమైన ఘటనల గురించి మాత్రమే పోస్టులు ఉండేవి. మనమంతా కలిసి ఇక్కడ ఎన్నో సంతోషాలు పంచుకున్నాము. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాము.
అంతా తలకిందులు
కానీ జూన్ 4.. మొత్తం అంతా తలకిందులు చేసింది. ఆ రోజు మన హృదయాల్ని ముక్కలు చేసింది. అప్పటి నుంచి మేము మౌనంగా ఉండిపోయాము. బాధలో కూరుకుపోయాము. అంతా నిశ్శబ్దంగా వింటూ ఉన్నాము. ఏం చేయాలో ఆలోచించాము.
కేవలం స్పందన కంటే.. ఇంకా గొప్పగా ఏదో చేయాలనుకున్నాము. అందుకే ‘RCB CARES’ను తీసుకువచ్చాము. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మన వాళ్లకు అండగా నిలుస్తాము.
ఈరోజు సెలబ్రేషన్‌తో కాకుండా మనవాళ్ల కోసం మేమిలా తిరిగి వచ్చాము. మీతో మేమున్నాం. మనమంతా కలిసి అడుగేద్దాం. కర్ణాటక గౌరవాన్ని కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్దాం. ఇది నిజం.. RCB CARES..’’ అంటూ ఉద్వేగపూరిత నోట్‌ను ఆర్సీబీ ఫ్రాంఛైజీ షేర్ చేసింది.
చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో