
ఢిల్లీకి చెందిన ‘సెహ్వాగ్’ అనే క్రికెటర్ తిరిగి మళ్లీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మీరు అనుకుంటున్నట్లు అతడు వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. అతడి పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్. ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌పై తన తొలి టీ20 మ్యాచ్‌ను ఆర్యవీర్ ఆడాడు.
తండ్రికి తగ్గ తనయుడు..
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఆర్యవీర్ తన తండ్రి శైలిలో ఫోర్ కొట్టి ఖాతా తెరవకపోయినా.. కానీ వీరేంద్రుడి మాదిరే తన దూకుడును ప్రదర్శించాడు. 18 ఏళ్ల ఆర్యవీర్ ఫాస్ట్ బౌలర్లను అద్బుతంగా ఎదుర్కొన్నాడు. కొత్త బంతితో భారత పేసర్ నవదీప్ సైనీని ఎదుర్కొన్న ఆర్యవీర్.. వరుసగా రెండు బౌండరీలు బాదాడు.
తొలి బౌండరీని ఆఫ్-సైడ్ దిశగా బాదిన జూనియర్ సెహ్వాగ్.. రెండో బౌండరీని చక్కటి లాఫ్టెడ్ డ్రైవ్‌తో రాబట్టాడు. అతడి డేరింగ్ బ్యాటింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఆర్యవీర్ కాసేపే క్రీజులో ఉన్నప్పటికి తన బ్యాటింగ్‌తో అలరించాడు. 16 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 4 ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా ఆర్యవీర్ ఇటీవలే ఇన్ సైడ్‌స్పోర్ట్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలన్న తన కోరికను ఆర్యవీర్ వ్యక్తం చేశాడు.
ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌పై 62 పరుగుల తేడాతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ గెలిచింది.
Classy batting! Aaryavir Sehwag smashes consecutive fours. 💥 🏏
Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/08KwyxqPeK— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025