
ఆయకట్టులో రెండో పంట లేనట్లేనా?
సాక్షి బళ్లారి: తుంగభద్ర జలాశయంలోని 33 గేట్లు శిథిలావస్థలో ఉన్నందున అన్నింటిని మార్పు చేయాలని నిపుణుల కమిటీ నివేదించింది. డ్యాం నిర్మాణం చేపట్టి 75 సంవత్సరాలైంది. దీంతో అన్ని గేట్లు ఖచ్చితంగా మార్చాల్సిందే. నిపుణుల కమిటీ ఈ నివేదిక ఇచ్చి ఏడాది గడిచింది. అయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో మూడు రాష్ట్రాలకు చెందిన తుంగభద్ర ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరు లేకుండా పోయే దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుంగభద్ర డ్యాంలోకి తగినంత నీరు చేరనప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వలేమని చెప్పడం పరిపాటి. అయితే ఈఏడాది తుంగభద్ర డ్యాంలోకి సకాలంలో నీరు రావడంతో పాటు డ్యాం నుంచి దాదాపు 200 టీఎంసీల నీరు నదికి వదిలారు.
చావు కబురు చల్లగా చెప్పిన మంత్రి
ఇలాంటి అతివృష్టి సమయంలో పాలకుల నిర్లక్ష్యంతో చావు కబురు చల్లగా చెప్పినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి డీకే.శివకుమార్ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్‌గేట్లు మార్చడానికి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, ఇప్పటికే గేట్ల తయారీ కూడా చురుకుగా సాగుతోందని చెప్పారు. ఈనేపథ్యంలో తుంగభద్ర డ్యాంలో గేట్లు పూర్తిగా మార్చడానికి తదితర సమస్యల పరిష్కారానికి ఆయకట్టు కింద రెండో పంటకు నీటి సరఫరా నిలుపుదల చేస్తేనే సాధ్యమవుతుందని ప్రకటించారు. దీంతో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధితో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. రెండవ పంటకు నీరు అందించలేమని చెప్పడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
టీబీ డ్యాం క్రస్ట్‌గేట్ల మార్పుతో
నీరు ఇవ్వలేమని మంత్రి వెల్లడి
ఎవరి నిర్లక్ష్యం వల్ల నీరివ్వడం లేదు? అని రైతుల మండిపాటు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
గత ఏడాది తుంగభద్ర డ్యాం వద్ద 19వ నంబరు క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నిపుణుల సలహా సూచనలతో తాత్కాలికంగా స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలువురు నిపుణులు పూర్తిగా పరిశీలించిన తర్వాత 33 గేట్లను మార్చాలని తుంగభద్ర బోర్డుకు నివేదికను అందజేశారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ పాలన యంత్రాంగం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సరైన రీతిలో స్పందించకపోవడంతో గేట్ల తయారీ ప్రక్రియ ఆలస్యమైందని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. నిపుణుల కమిటీ సూచించిన తర్వాత వెంటనే గేట్లను తయారు చేయించి నీరు నిలుపుదల చేసిన తర్వాత గత వేసవిలో నాలుగు నెలల పాటు డ్యాం ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకే నీటి నిల్వను కుదించి ఒకే పంటకు నీరు అందించడానికి చర్యలు తీసుకోవడంతో రబీలో లక్షలాది ఎకరాలు బీడుగా మారే ప్రమాదముందని, తమకు భారీ నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.