
దంచి కొట్టిన వానలు.. జలమయంగా వీధులు
హొసపేటే: నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారుల్లో వర్షం నీరు ఏరులా ప్రవహించింది. గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం పాఠశాలల నుంచి విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలు సాయంత్రం 3 గంటల నుంచి ఏకధాటిగా సుమారు ఆరు గంటల పాటు భారీ వర్షం కురియడంతో నగరంలోని ప్రధాన మోర్ రోడ్డు, పవర్ ప్లాజా వద్ద ఉన్న రహదారిలో వర్షం నీరు భారీగా చేరడంతో వాహన సంచారానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ రోడ్లలో మోకాలి లోతున వర్షం నీరు ప్రవహించడంతో కొద్ది సేపటి వరకు వాహనాలు నిలిచి పోయాయి. ఇందిరా నగర్ కాలనీలో వర్షం నీటితో వీధులు జలమయంగా మారడంతో పాటు ఇళ్లలోకి వర్షం నీరు ప్రవహించింది. దీంతో కాలనీ ప్రజలు వర్షం నీటిలోనే గడప వలసి వచ్చింది. జిల్లా క్రీడా మైదానం రహదారిలో కూడా వర్షం నీటితో నిండిపోయింది. నగరంలో చిత్తవాడిగి, నెహ్రు కాలనీ, బసవేశ్వర బడావణె, మృత్యుంజయ నగర్, చప్పరదహళ్లి, అమరావతి, రాజీవ్‌నగర్, ఎంపీ ప్రకాష్ నగర్, రాణి పేట్, పటేల్ నగర తదితర చోట్ల వర్షం నీరు నిలిచింది.
కుండపోత వర్షాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం కూడా జోరు వాన కురిసింది. పలు జిల్లాల్లో ఎక్కడ చూసినా వంతెనలు నీట మునిగాయి. రాత్రంతా కురిసిన వానతో అక్కడక్కడ వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలబుర్గి జిల్లా సేడం తాలూకాలో రాత్రి భారీ వర్షం కురవడంతో కాగిణ నదిలో వరద ముంచెత్తింది. వంతెన నీట మునగడంతో వాహన రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా మస్కి వద్ద ఉన్న జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో హిరేహళ్లలో నీరు అధికంగా ప్రవహించింది. రైతు హన్మంతప్ప ఎద్దులబండి నీటిలో చిక్కుకుంది. హన్మంతప్పను ప్రజలు రక్షించారు. ఒక ఎద్దు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోగా మరో ఎద్దుతో పాటు బండి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
పాదచారులకు నరకయాతన
వాహన రాకపోకలకు పాట్లు

దంచి కొట్టిన వానలు.. జలమయంగా వీధులు

దంచి కొట్టిన వానలు.. జలమయంగా వీధులు