
ఖాదీ పతాకాలకు ఆదరణ ఏదీ?
హుబ్లీ: ఆగస్టు నెల వచ్చిందంటే చాలు హుబ్లీలోని దేశంలో ఏకై క బీఐఎస్ ప్రామాణీకృత ఖాదీ త్రివర్ణ పతాకాల ఉత్పత్తి కేంద్రంలో రాత్రింబగళ్లు జాతీయ జెండాలను కుట్టే పనిలో మహిళా ఉద్యోగినులు మునిగి పోయే వారు. అయితే ఈ ఏడాది ఆ కళ సందడి కనిపించడం లేదు. కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జాతీయ పతాకాలను తయారు చేసే హుబ్లీలోని బెంగేరి కర్ణాటక గ్రామోద్యోగ సంయుక్త ఈ ఏడాది తన లాభాల్లో 75 శాతం తగ్గిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు సంఘం సుమారు రూ.2.7 కోట్లను గడించేది. అయితే కేవలం రెండు, మూడు రోజులు మిగిలి ఉండగా రూ.49 లక్షలు విలువ చేసే ఆర్డర్లను పొందడం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా పాలిస్టర్ పతాకాలను ఎగరవేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటి నుంచి సంఘం నష్టాలను అనుభవిస్తోంది.
పాలిస్టర్ కంపెనీలకు లాభాలు
గత రెండేళ్ల నుంచి మార్కెట్లలో గుజరాత్ పాలిస్టర్ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. కేంద్రం జాతీయ పతాక నియమావళిని సవరించడంతో వివిధ ప్రభుత్వ కట్టడాలు, సంస్థలు కూడా పాలిస్టర్ పతాకాలను ఎగరవేస్తున్నాయి. ఎక్కువ ఖరీదు చేసే ఖాదీ పతాకాలు సహజంగానే విక్రయాలకు దూరం అయ్యాయి. ఖాతీ పతాకాలు సుదీర్ఘకాలం మన్నిక కలిగి ఉన్నా కూడా వాటి డిమాండ్ కోల్పోతుంది. కేంద్రం జాతీయ పతాక నియమాలను మార్చడమే మన హుబ్లీ సుప్రసిద్ధ జాతీయ పతాక యూనిట్‌లోని యంత్రాలు కళావిహీనం అవుతున్నాయి. సంఘం ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆర్‌డీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు లేఖ రాసి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ప్రభుత్వ సంస్థలు ఖాదీ త్రివర్ణ పతాకాలను ఎగరవేసేలా సూచించాలని సంఘం విజ్ఞప్తి చేసిందని హుబ్లీ ఖాదీ సమాఖ్య కార్యదర్శి శివానంద మఠపతి తెలిపారు.
ఉద్యోగాల కల్పనకు బ్రేక్
నియమావళిలో మార్పులతో తయారీ కేంద్రంపై ఆధారపడిన కార్యకర్తలపై తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు. తమకు తక్కువ ఆర్డర్ ఉన్నందు వల్ల ఈ సారి పలువురికి ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యం కాలేదు. బెంగేరి జాతీయ పతాక తయారీ కేంద్రంలో మహిళా కార్మికులను మాత్రమే నియమించుకొని ఈ సీజన్‌లో పలువురికి పని లేదని చెప్పడం ఆవేదన కలిగించే విషయం. ఇలాగే కొనసాగితే సమాఖ్య, ఖాదీని ఆదరించే ప్రయత్నాలకు వెనుకబాటు తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశం ఉన్నా కూడా అనేక ప్రభుత్వ సంస్థలు ఇంకా జాతీయ పండుగలకు ఖాదీ పతాకాలను సిద్ధం చేసుకోలేదు. ఖాదీ పతాకాలను తప్పని సరిగా వాడాలని ప్రభుత్వ సంస్థలకు జీఓ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఈ యూనిట్‌లో జాతీయ పతాకాలతో పాటు ప్రస్తుతం సంచులు ఇతర రెడీమేడ్ దుస్తులు, రగ్గులు వంటి ఖాదీ వస్తువుల తయారీతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు.
తయారీ కేంద్రానికి 75 శాతం మేర పతనమైన లాభాలు
హుబ్లీలోని జాతీయ జెండాల తయారీ యూనిట్ వెలవెల