
హర్ ఘర్ తిరంగా ర్యాలీకి శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా జాలహళ్లిలో హర్ ఘర్ తిరంగాకు దేవదుర్గ తాలూకా బీజేపీ అధ్యక్షుడు శరణ బసవ పాటిల్ శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రజలకు తిరంగా ప్రాముఖ్యత గురించి వివరించారు.
హుబ్లీ–రామేశ్వరం రైలు గడువు పొడిగింపు
హుబ్లీ: దక్షిణ రైల్వేలోని కార్యాచరణ నిర్బంధాల వల్ల హుబ్లీ–రామేశ్వరం–హుబ్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు సంచారం గడువు విస్తరించడానికి రైల్వే మండలి అనుమతి ఇచ్చిందని నైరుతి రైల్వే పేర్కొంది. అయితే ఈ రైలు రామేశ్వరానికి బదులు రామనాథపురం వరకు మాత్రమే సంచరిస్తుంది. గతంలో ఈనెల 30 వరకు సంచారానికి సూచించినా ఈ రైలును ప్రస్తుతం సెప్టెంబర్ 27 వరకు నాలుగు ట్రిప్పుల మేరకు పొడిగించారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించండి
రాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం నగరసభ కార్యాలయంలో అధ్యక్షురాలు నరసమ్మ అధ్యక్షతన జరిగిన స్వసహాయ మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ భారత్–2 పథకం కింద స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. సహకార సంఘాల ద్వారా ఎంపికై న మహిళలకు గుర్తింపు కార్డులను అందించారు. నగరసభ పరిధిలో బకాయి ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లలో ముందుండాలన్నారు. స్వచ్ఛతకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ముందుకు రావాలన్నారు. సమావేశంలో సంతోష్ రాణి, జైపాల్, కృష్ణ కట్టిమనిలున్నారు.
వైద్య పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలోని నిజలింగప్ప కాలనీ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరిటాల రాము నేతృత్వంలో 80 మంది సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య సేవలందించారు. వైద్యుడు నాగభూషణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గోవిందరాజులు, గురురాజ్‌లున్నారు.
ఠాణాలో రౌడీ హల్‌చల్
మైసూరు: తనపై బనాయించిన రౌడీషీట్‌ను తొలగించాలని మైసూరు నగరంలోని విజయనగర ఠాణాలోనే ఒంటిపై డీజిల్ పోసుకుని రౌడీషీటర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. మైసూరు బోగాది నివాసి ఎస్.స్వామిపై పలు కేసులు ఉండడంతో విజయనగర పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్‌ను తెరిచారు. రానున్న గణేష్ పండుగ, దసరా పండుగల నేపథ్యంలో రౌడీషీటర్ల నుంచి హామీ పత్రాలు రాయించుకోవాల్సిన నిబంధనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన స్వామి డీజిల్ తీసుకుని ఠాణాకు వచ్చాడు, తనపై ఉన్న రౌడీషీట్‌ను తీసేయాలని హంగామా చేస్తూ పోలీసుల ఎదుటే ఒంటిపై పోసుకున్నాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ఇలా ప్రవర్తించి పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించాడని స్వామిపై మరో కేసును నమోదు చేశారు.

హర్ ఘర్ తిరంగా ర్యాలీకి శ్రీకారం

హర్ ఘర్ తిరంగా ర్యాలీకి శ్రీకారం